Moeen Ali: రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్..

by Vinod kumar |
Moeen Ali: రెండోసారి రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ టెస్ట్ క్రికెట్‌కు మరోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈసారి బెన్‌స్టోక్స్ నాకు మళ్లీ మెసేజ్ చేస్తే వెంటనే డిలీట్ చేస్తానని నవ్వుతూ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ ముగిసిన తర్వాత అతను ఈ నిర్ణయం ప్రకటించాడు. చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై 49 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ విక్టరీలో మూడు వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పటికే 2021 సెప్టెంబర్‌లో టెస్టులకు రిటర్మెంట్ ప్రకటించాడు మొయిన్ అలీ.

ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మొయిన్ 180 పరుగులతో పాటు 9 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్‌ని బాగా ఎంజాయ్ చేశానని, చివరి మ్యాచ్‌ను విజయంతో ముగించడం సంతోషంగా వుందన్నాడు. సిరీస్‌ మొత్తం తనకు స్టోక్స్ అండగా నిలిచాడని, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నందుకు సంతోషంగా వుందని పేర్కొన్నాడు. అయితే వన్డే, టీ 20లలో మాత్రం మొయిన్ అలీ కొనసాగనున్నాడు. ఇకపోతే.. 68 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన మొయిన్ అలీ 3,094 పరుగులు సాధించగా.. ఇందులో 5 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. 204 వికెట్లు తీశాడు. అయితే యాషెస్ సిరీస్ 2023కి ముందు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ గాయం బారినపడ్డాడు. దీని తీవ్రత కారణంగా అతను ఏకంగా యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్ నచ్చజెప్పడంతో అలీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో సెలెక్టర్లు అతనిని యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేశారు.

Advertisement

Next Story

Most Viewed