క్రికెట్‌కు బ్రావో వీడ్కోలు.. కొన్ని గంటల్లోనే అతనికి గుడ్ న్యూస్ చెప్పిన కేకేఆర్

by Harish |   ( Updated:2024-09-27 12:10:52.0  )
క్రికెట్‌కు బ్రావో వీడ్కోలు.. కొన్ని గంటల్లోనే అతనికి గుడ్ న్యూస్ చెప్పిన కేకేఆర్
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 2021లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను అప్పటి నుంచి కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అతను తాజాగా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని గంటల్లోనే బ్రావోకు కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు అతన్ని మెంటార్‌గా నియమించింది.

గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో కేకేఆర్ ఈ సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ నియామకవడంతో మెంటార్ రోల్ ఖాళీగా ఉంది. దీంతో సరైన మెంటార్ కోసం వెతికిన కేకేఆర్ ఎట్టకేలకు ఆ స్థానాన్ని బ్రావోతో భర్తీ చేసింది. ఐపీఎల్‌తోపాటు కేకేఆర్‌కు చెందిన అన్ని ఫ్రాంచైజీలకు అతను బాధ్యత వహిస్తాడు.

బ్రావో కేకేఆర్ గూటికి చేరడంతో చెన్నయ్ సూపర్ కింగ్స్‌(సీఎస్కే)తో అతనికి ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. 2011 నుంచి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను 2022 సీజన్ వరకు ప్లేయర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్ తర్వాత అతను రిటైర్ అవ్వగా గత సీజన్‌లో చెన్నయ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్‌కు కన్సల్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లతో కలిసి బ్రావో కేకేఆర్‌కు మార్గదర్శకత్వం చేయనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed