టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

by Harish |
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. హెడ్ కోచ్ పదవీ కాలం 3.5 ఏళ్లు అని, ఈ ఏడాది జూలై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది. దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 27 చివరి తేదీ అని పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన, పర్సనల్ ఇంటర్యూ, షార్ట్ లిస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపింది.

హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి బోర్డు నిర్దేశించిన అర్హతలు, నైపుణ్యాల ప్రకారం.. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడాల్సి ఉంటుంది. లేదా పూర్తి స్థాయి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు హెడ్ కోచ్‌గా చేసి ఉండాలి. లేదా మూడేళ్లపాటు అసోసియేట్ సభ్యు దేశానికి/ఐపీఎల్ టీమ్/సమానమైన ఇతర ఇంటర్నేషనల్ లీగ్‌లోని జట్టు/ఫస్ట్ క్లాస్ టీమ్స్/నేషనల్ ఏ జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలి. అలాగే, బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ లేదా సమానమైన అర్హతలు ఉండాలి. వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. వన్డే వరల్డ్ కప్‌తోనే ద్రవిడ్ పదవీకాలం ముగియగా టీ20 వరల్డ్ కప్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు ఆసక్తి ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇటీవల బీసీసీఐ సెక్రెటరీ జైషా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి, మరోసారి ద్రవిడ్ హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed