చెలరేగిన రహానె.. ఇంగ్లాండ్ టోర్నీలో శతక మోత

by Harish |
చెలరేగిన రహానె.. ఇంగ్లాండ్ టోర్నీలో శతక మోత
X

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె ఇంగ్లాండ్ దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. టోర్నీలో లీసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న అతను గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదివారం శతకంతో కదం తొక్కాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రహానెకు ఇది 40వ సెంచరీ. గతేడాది జనవరిలో రంజీ ట్రోఫీలో 39 శతకం బాదిన అతను 19 నెలల తర్వాత సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. మ్యాచ్‌లో నాలుగో రోజు రహానె కీలక ఇన్నింగ్స్ ఆడటంతో లీసెస్టర్‌షైర్ జట్టు ఇంకా పోటీలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో లీసెస్టర్‌షైర్ 251 పరుగులు చేయగా.. గ్లామోర్గాన్ 550/9 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. 299 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లీసెస్టర్‌షైర్ 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రహానె సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 13 ఫోర్లు, ఓ సిక్స్‌తో 192 బంతుల్లో 102 పరుగులు చేశాడు. పీటర్ హాన్స్‌డ్‌స్కాంబ్‌తో కలిసి జట్టును కష్టాల నుంచి బయటపడేశాడు. 4 వికెట్‌కు రహానె 183 పరుగులు జోడించాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత కాసేపటికే రహానె క్యాచ్ అవుటై వెనుదిరిగాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో అతను 42 పరుగులు చేశాడు. గతేడాది జూలైలో వెస్టిండీస్‌తో భారత్ తరపున చివరి టెస్టు ఆడిన రహానె.. యువకులు రాణిస్తుండటంతో టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. త్వరలో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీకి కూడా సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయలేదు.

Advertisement

Next Story

Most Viewed