Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం

by Y. Venkata Narasimha Reddy |
Sourav Ganguly : సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)రోడ్డు ప్రమాదాని(Road Accident)కి గురయ్యారు. సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారు దుర్గాపూర్ ఎక్సప్రెస్ రహదారిపై దంతన్ పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గంగూలీ కారు దెబ్బతింది. గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి బుర్ద్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది. వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టగా, వాటిలో ఒకటి సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో సౌరవ్ గంగూలీతో పాటుగా ఆయన కాన్వాయ్‌లోని మరెవరికీ గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన తరువాత సౌరవ్ గంగూలీ దాదాపు 10 నిమిషాలు రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది.

సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీ కూడా జనవరి 25న రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. సనా ముందు సీట్లో కూర్చున్నప్పటికీ, ఆమె డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని తప్పించారు.

సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున 311 వన్డేల్లో 40.73 సగటుతో 11 వేల 363 పరుగులు చేశాడు, ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 183 పరుగులు. సౌరవ్ గంగూలీ 113 టెస్ట్ మ్యాచ్‌ల్లో 42.18 సగటుతో 7 వేల 212 పరుగులు చేశాడు, ఇందులో 16 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టెస్ట్ క్రికెట్‌లో ఒక డబుల్ సెంచరీ చేసిన రికార్డు కూడా సౌరవ్ గంగూలీ పేరు మీద ఉంది. టెస్ట్ క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ అత్యుత్తమ స్కోరు 239 పరుగులు కావడం విశేషం. భారత క్రికెట్‌లో అత్యంత దూకుడైన ఆటగాడిగా, విజయవంతమైన కెప్టెన్ గా గంగూలీ పేరు తెచ్చుకున్నారు.

Next Story

Most Viewed