ఆష్లే బార్టీ @ఆల్ రౌండర్.. టెన్నిస్ స్టార్, క్రికెటర్, గోల్ఫ్ ప్లేయర్!

by Disha News Desk |
ఆష్లే బార్టీ @ఆల్ రౌండర్.. టెన్నిస్ స్టార్, క్రికెటర్, గోల్ఫ్ ప్లేయర్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ -2022 విజేత ఆష్లే బార్టీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. స్వదేశంలో తొలిసారి (AO) గ్రాండ్ స్లామ్ నెగ్గడంతో అభిమానులు బార్టీని ప్రశంసలతో ముంచెత్తారు. ఏకంగా 44 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి బార్టీ టైటిల్ విజేతగా నిలవడంతో ఆసిస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1978లో 'క్రిస్ ఓ నీల్' తర్వాత మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ గెలుచుకున్న క్రీడాకారిణిగా బార్టీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నంబర్ -1 ఆష్లే బార్టీ అమెరికా స్టార్ క్రీడాకారిణి డానియెలీ రోజ్ కొలిన్స్‌ను 6-3,7-6 పాయింట్లతో వరుస సెట్లలో ఓడించింది. తుదిపోరులో బార్టీ విజృంభించడంతో అమెరికా ప్లేయర్ కొలిన్స్‌కు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ నిరాశే మిగిల్చింది.

ఆష్లే బార్టీ ప్రస్థానం..

ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రం ఇప్స్‌విచ్‌లో 24 ఏప్రిల్ 1996లో బార్టీ జన్మించింది. తల్లి జోసి, తండ్రి రాబర్ట్ బార్టీ.. (WTA) ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్‌గా కొనసాగుతున్న బార్టీ.. నాలుగేళ్ల వయస్సులోనే బ్రిస్బేన్‌లో టెన్నిస్ ఆడటం ప్రారంభించింది. ఈమె కోచ్ క్రేగ్ టిజ్జర్. జూనియర్ టెన్నిస్ విభాగంలో బార్టీ 2011లో అమ్మాయిల వింబుల్డన్ సింగిల్స్ గెలిచి వరల్డ్ నంబర్ -2 ర్యాంకింగ్ సంపాదించింది. 2013లో WTA టీనేజర్‌ డబుల్స్‌‌లో సత్తా చాటి మూడు గ్రాండ్ స్లామ్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2017లో బార్టీ తన కెరీర్‌లో తొలిసారి మలేషియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచి వరల్డ్ నం-17గా అవతరించింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత బార్టీ వరల్డ్ నెం-1గా రికార్డు క్రియేట్ చేసింది. కాగా, 2021లో బార్టీ తన బాయ్ ఫ్రెండ్ గ్యారీ కిస్సిక్‌ను పెళ్లాడింది.

గ్రాండ్ స్లామ్ సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ రికార్డులు..

ఆష్లే బార్టీ తన కెరీర్‌లో ఇప్పటివరకు మూడు సింగిల్స్ గ్రాండ్ స్లామ్స్ కైవసం చేసుకుంది. 2022లో ఆస్టేలియా ఓపెన్, 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్ డన్, 2018,19లో యూఎస్ ఓపెన్ నాలుగు సార్లు రన్నరప్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ విషయానికొస్తే 12 టైటిల్స్ సొంతం చేసుకుని ప్రస్తుతం 83వ ర్యాంక్ లో కొనసాగుతోంది. గ్రాండ్ స్లామ్స్ డబుల్స్ విషయానికొస్తే 2013లో ఆస్టేలియన్ ఓపెన్ ఫైనల్, 2013 వింబుల్ డన్ ఫైన‌ల్, 2017 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్, 2018 యూఎస్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ విషయానికొస్తే తన కెరీర్ 7-8గా కొనసాగుతోంది. గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ సెకండ్ రన్నరప్, 2013 ఫ్రెంచ్ ఓపెన్ ఫస్ట్ రన్నరప్, 2013 వింబుల్డన్ క్వార్టర్ ఫైనలిస్ట్, 2014 యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచింది.


ఫ్రొఫెషనల్ క్రికెటర్‌, గోల్ఫ్ ప్లేయర్‌..!

2014లో టెన్నిస్‌కు బ్రేక్ ఇచ్చిన ఆష్లే బార్టీ.. 2015 ప్రారంభంలో ఆస్ట్రేలియా మహిళల జాతీయ జట్టుతో సమావేశమై క్రికెట్ ఆడేందుకు ఆసక్తి కనబరిచింది. అప్పటివరకు క్రికెట్ అనుభవం లేని బార్టీ కుటుంబంతో సాధారణంగా ఆడేది. క్వీన్స్‌ల్యాండ్ ఫైర్ కోచ్, బ్రిస్బేన్ హీట్ కోచ్ ఆండీ రిచర్డ్స్ బార్టీలోని నైపుణ్యాన్ని గుర్తించి శిక్షణ ఇచ్చాడు. బార్టీ బ్యాటింగ్ నైపుణ్యం కోచ్‌ను బాగా ఆకర్షించింది. తన తొలి సెషన్‌లో బార్టీ ఎప్పుడూ బాల్‌ను మిస్ చేయలేదని తోటి ప్లేయర్లు చెప్పారు.

బ్రిస్బేన్ ఉమెన్స్ ప్రీమియర్ క్రికెట్ టీ20 లీగ్‌లో పోటీపడే స్థానిక జట్టు వెస్ట్రన్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్ కోసం ఆడిన బార్టీ.. నాలుగు ఓవర్లలో 2–13తో పాటు 60 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బార్టీ వెస్ట్రన్ సబర్బ్స్ తరపున 13 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 42.4 పరుగుల సగటుతో 8 వికెట్లు తీసింది. చివరగా బార్టీ ఆడిన వెస్ట్రన్ సబర్బ్స్ గ్రాండ్ ఫైనల్‌ను గెలుచుకుంది. బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్‌లో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచింది.అంతేకాకుండా మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లోనూ బార్టీ సత్తా చాటింది.


2020లో కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ క్రమంలో బార్టీ పారిస్‌కు వెళ్లింది. కొవిడ్ భయాన్ని వదిలి రోలాండ్ గారోస్ టైటిల్‌ను తిరిగి కాపాడుకునేందుకు.. గోల్ఫ్ క్లబ్‌లను ఎంచుకుంది. ఈ క్రమంలోనే బ్రిస్బేన్ సమీపంలో గ్రెగ్ నార్మన్ రూపొందించిన కోర్సులో ఆమె మ్యాచ్‌ ప్లే ఫైనల్‌లో 7-5 విజయాలతో బ్రూక్‌ వాటర్ గోల్ఫ్ క్లబ్ మహిళల టైటిల్‌ను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటిన బార్టీ..

2020 ఆస్ట్రేలియా సమ్మర్ ఒలింపిక్స్‌ సింగిల్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరుకోగా.. అదే ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ కొవిడ్ కారణంగా వాయిదా పడి 2021లో నిర్వహించగా.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బార్టీ అండ్ జాన్ పీర్స్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed