క్రీడలతో కరోనాకు చెక్ : పీవీ సింధు

by Shyam |
క్రీడలతో కరోనాకు చెక్ : పీవీ సింధు
X

దిశ, స్పోర్ట్స్: కరోనాపై పోరాడాలంటే ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, ఇందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అన్నారు. క్రీడలతోనే మనం కరోనాకు చెక్ పెట్టగలమని, అందుకే ప్రతి ఒక్కరు క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె చెప్పారు. కరోనా, క్రీడలు అనే అంశంపై మీడియాతో మాట్లాడిన సింధు పలు విషయాలు వెల్లడించారు. ‘బలమైన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఏర్పడాలంటే క్రీడలు, శారీరక శ్రమ అవసరం. ఇప్పటివరకు కొవిడ్-19కు టీకా కానీ సరైన చికిత్స కానీ అందుబాటులో లేదు. కాబట్టి మనకున్న ప్రత్యామ్నాయం ఇమ్యూనిటీ పెంచుకోవడమే. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవాళ్లు కనీసం వారానికి 300 నిమిషాలు సాధారణ ఏరోబిక్స్ చేయడం అవసరం. డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఇదే విషయం చెప్పింది’ అని సింధు వివరించింది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు రోజులో 45 నిమిషాలపాటు వ్యాయామం చేయడం లేదా ఆటలు ఆడటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆమె సూచించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ వల్ల క్రీడాకారులు మరింతగా ప్రాక్టీస్ చేసే సమయం లభించిందని, మాజీ క్రీడాకారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే సౌలభ్యం కూడా ఏర్పడిందన్నారు.

Advertisement

Next Story