అరకు ఉత్సవాలు షురూ..!

by srinivas |
అరకు ఉత్సవాలు షురూ..!
X

నేలను ముద్దాడేందుకు వస్తున్నాయా? అన్నట్టు కిందికి దిగే మేఘాలు, దిశ వెబ్‌డెస్క్: కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం, జలపాతాల గలగలలు, కొండలను తొలిచి ఏర్పాటుచేసే దారుల్లో సాగే ప్రయాణం, కమ్మని సువాసనలు పంచే కాఫీ తోటలు, ఆకాశానికి నిచ్చెన వేస్తున్నాయా? అన్నట్టు ఎత్తైన సిల్వర్ చెట్లు, ఆ చెట్ల మొదళ్లను కనబడనివ్వకుండా అల్లుకున్న మిరియాల తీగలు, గిరిజన మ్యూజియం, బొర్రాగుహలు…ఇలా ఒకటేమిటి…చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు విశాఖ ఏజెన్సీ సొంతం. శీతాకాలంలో మైనస్ ఆరు నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏజెన్సీలోని లంబసింగి ఆంధ్రా కశ్మీర్‌గా పేరు సాధిస్తోంది.

ప్రకృతి సౌందర్యాల ఆంధ్రా ఊటీ అరకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వైజాగ్‌కు 117 కిలోమీటర్ల దూరంలో వున్న అరకులోయకు ఉత్సవశోభను ప్రభుత్వం తీసుకొచ్చింది. శీతాకాలంలో అరకు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు పోటెత్తుతారు. అయితే ఆ సమయంలో పగటి కాలం తక్కువతో పాటు చలి ఉధృతి కూడా ఎక్కువే… ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం విభాగం వేసవి ఆరంభంలో ఉత్సవాలు నిర్వహించాలని భావించింది.

ఇంతటి ప్రకృతి సోయగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు అరకులోని ఎన్టీఆర్ క్రీడామైదానంలో రెండురోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గిరిజనుల ఆచార, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ఈ ఉత్సవాల రూపకల్పన జరిగింది. పర్యాటకులు గిరిజనుల సంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అటవీ ఉత్పత్తులు, హస్తకళలకు మార్కెట్ పెంపొందించే లక్ష్యంతో ఏటా ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఉదయం 10.30 గంటలకు అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ఉత్సవాలను ప్రారంభించారు. రోజంతా గిరిజన సంప్రదాయ క్రీడాపోటీలు జరగుతున్నాయి. సాయంత్రం 5.20 గంటలకు గిరిజన సంప్రదాయ థింసా నృత్యం, 6.20 గంటలకు లంబాడా నృత్యం, 6.50 గంటలకు బొండా నృత్యం తొలిరోజు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల మధ్యలో ప్రముఖ సినీ నటుడు శివారెడ్డి మిమిక్రీ, మ్యూజికల్ బ్యాండ్, సంగీత విభావరి జరగనున్నాయి.

రేపు రోజంతా క్రీడల నిర్వహణ జరుగనుండగా, సాయంత్రం 5 గంటలకు ఇతర రాష్ట్రాల గిరిజన కళాకారుల నృత్యోత్సవం నిర్వహించనున్నారు. ఆ తరువాత స్థానిక గిరిజనుల కొమ్మకోయ, సవర తదితర సంప్రదాయ నృత్య ప్రదర్శనలుంటాయి. రాత్రికి తెలంగాణ జానపద, సినీ గాయని మంగ్లీ, అనుదీప్‌ల సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో గిరిజనులే కాకుండా వైజాగ్‌తో పాటు ఒడిశా నుంచి కూడా పర్యాటకులు భారీ సంఖ్యలో పాల్గోనున్నారు.

Advertisement

Next Story