గుడికి, పెళ్లికి వెళ్లినప్పుడు రూ.116 ఎందుకు ఇస్తామో తెలుసా?.. 16కు ఉన్న అసలు రహస్యం ఇదే! (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-22 14:15:22.0  )
గుడికి, పెళ్లికి వెళ్లినప్పుడు రూ.116 ఎందుకు ఇస్తామో తెలుసా?.. 16కు ఉన్న అసలు రహస్యం ఇదే! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) ప్రాంతానికి చెందిన వారు ఏ పెళ్లికి వెళ్లినా.. ఆలయానికి వెళ్లినా నూట పదహార్లు, వెయ్యి నూటపదహార్లు కట్నం వేస్తుంటారు. వంద రూపాయలు వేయొచ్చు.. వెయ్యి రూపాయలు వేయొచ్చు.. కానీ ఎవరూ అలా చేయరు.. ఎంత కష్టమైనా సరే ఆ పైన 16 రూపాయలు తెచ్చుకున్న తర్వాతే కట్నం వేస్తుంటారు. అలా ఎందుకు వేస్తున్నారో కొందరికి తెలిసినా, అందరికీ తెలియకపోవచ్చు. అలా ఎందుకు వేస్తామో, ఎప్పుడు, ఎక్కడ మొదలైందో చెప్పారు ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు(Garikipati Narasimha Rao). ఆ 16కు అసలు రహస్యాన్ని ఆయన చక్కగా వివరించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.

అలా ఎందుకు మొదలైందో ఆయన మాటల్లోనే చెప్పే ప్రయత్నం.. ‘‘తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నవాబు(Nizam Nawab) పాలించే కాలంలో కరెన్సీ వేరుగా ఉండేది. అదే సమయంలో ఆంధ్రాను బ్రిటీషర్లు పాలించారు కాబట్టి అక్కడ వేరే కరెన్సీ ఉండేది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చి వెళ్లే కవులకు ఇక్కడి సంస్థానాధిపతులు రూ.100 కానుకల రూపంలో ఇచ్చేవారట. కరెన్సీ వేరు కాబట్టి అవి అక్కడకు వెళ్లేసరికి రూ.91 లేదా రూ.92 అయ్యేదట. ఈ విషయం తెలుసుకున్న నిజాం నవాబులు.. ఇది కరెక్ట్ కాదు.. మనం ఇచ్చే వంద రూపాయలు వారి ఇంటివరకూ వెళ్లాలి.. దానికి మనం ఏం చేయాలి.. వారికి ఎంత ఇస్తే.. ఇంటికి వందరూపాయలు తీసుకెళ్లగలుగుతారు అని సహచరులను అడగ్గా.. మనం సరిగ్గా రూ.116 ఇస్తే వాళ్లు ఏపీకి వెళ్లినా రూ.100 మిగుల్తాయి ప్రభు అని చెప్పారట.. దీంతో వారికి అప్పటినుంచి నిజాం ప్రభువు రూ.116 ఇవ్వడం స్టార్ట్ చేశారట’’ అందుకే తెలంగాణ ప్రాంతం వారికి ఏదైనా పెళ్లికి వెళ్లినా, ఆలయానికి వెళ్లినా రూ.116, రూ.10,116 ఇవ్వడం అలవాటుగా మారిందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం గరికపాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story