- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL: బ్రాడ్‌కాస్టింగ్‌తో కాసుల వర్షం.. ఆ రైట్స్‌తో ఏకంగా రూ.కోట్లలో ప్రాఫిట్

దిశ, స్పోర్ట్స్: ‘నరికేకొద్దు నీకు అలుపొస్తదేమో.. నాకు ఊపొస్తది’ అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ చాలా ఫేమస్.. ఇదే డైలాగ్‌ను ఐపీఎల్ ఫ్యాన్స్ వర్షన్‌లో చెప్పాలంటే..‘ఆడేకొద్ది ఆటగాళ్లకు అలుపొస్తదేమో.. చూసేకొద్ది మాకు ఊపొస్తది’. ఐపీఎల్‌పై ఉన్న ఈ పిచ్చే బ్రాడ్‌కాస్టర్లకు కాసులపంట పండిస్తోంది. ఏ కంపెనీ అయినా తమ ప్రొడక్ట్‌ను ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలనుకుంటుంది. అందుకే వారు ఐపీఎల్ సీజన్‌లో యాడ్స్ ఇస్తుంటారు. దీన్ని బ్రాడ్‌కాస్టర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. ఐపీఎల్ సీజన్‌లో టీవీల్లో యాడ్ ఇవ్వడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. లక్షలు కాదు.. కోట్లలో ఖర్చు చేయాల్సిందే. రూ.వేల కోట్లు పెట్టి ఐపీఎల్ మీడియా హక్కులు కొనుక్కున్న సంస్థలు.. తిరిగి వాటిని రాబట్టుకునేందుకు యాడ్స్ రేట్లను భారీగా పెంచేశాయి.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రతీ సారి మీడియా రైట్స్‌ను భారీ రేట్లకు బీసీసీఐ అమ్ముకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు టీవీ రైట్స్‌ను మల్టీ స్క్రీన్ మీడియా (సోనీ టీవీ)కి కట్టబెట్టింది. 10 ఏళ్ల కాలానికి రూ.8,200 కోట్లకు బ్రాడ్‌కాస్ట్ హక్కులు అమ్మింది. అప్పట్లో అదే పెద్ద రికార్డు. అయితే అప్పట్లో ఓటీటీ, ఇంటర్నెట్ స్ట్రీమింగ్ వంటివి పెద్దగా అభివృద్ధి చెందలేదు. దీంతో బీసీసీఐ కూడా దీనిపై దృష్టి పెట్టలేదు. 2012 తర్వాత డేటా వినియోగం బాగా పెరిగింది. ప్రేక్షకులు టీవీల్లోనే కాకుండా ఓటీటీల్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2015-18 మధ్య కాలానికి ప్రత్యేకంగా డిజిటల్ హక్కులను స్టార్ ఇండియాకు రూ.302 కోట్లకు విక్రయించింది. అలా తొలి పది ఐపీఎల్ సీజన్లకు గాను మొత్తం రూ.8,502 కోట్ల మేర బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల రూపంలో బీసీసీఐ సంపాదించింది.
బ్రాడ్‌కాస్టింగ్ హక్కులతో డబ్బే డబ్బు
తొలి 10 సీజన్లు ముగిసే సమయానికి టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు, ప్రేక్షకుల ఆదరణను గమనించిన బీసీసీఐ 2017లో 2018-22 సర్కిల్‌కు సంబంధించి మీడియా రైట్స్ కోసం టీవీ, డిజిటల్ కేటగిరీలో టెండర్లను ఆహ్వానించింది. ఈ హక్కుల కోసం ఫేస్‌బుక్, భారతి ఎయిర్‌టెల్, జియో, సోనీ మూవీస్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. కానీ స్టార్ ఇండియా టీవీ, డిజిటల్ రైట్స్ కోసం రూ. 16,347 కోట్లకు బిడ్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా స్టార్ ఇండియా భారీ మొత్తానికి ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. అంటే ఒక్కో మ్యాచ్‌కు రూ.54.50 కోట్ల మేర బీసీసీఐకి సమకూరింది. ఇక 2022తో స్టార్ ఇండియా రైట్స్ ముగిశాయి. 2023-27 కాలానికి మరోసారి బీసీసీఐ టెండర్లు పిలిచింది. ఈ సారి బీసీసీఐ ఏకంగా జాక్ పాట్ కొట్టింది. ఐపీఎల్ శాటిలైట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా రూ.23,575 కోట్లకు కొనుగోలు చేసింది. అదే సమయంలో ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ను వయాకామ్ 18 (జియో సినిమా) రూ.23,758 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే టీవీ, డిజిటల్ రైట్స్ మొత్తం కలిపి ఏకంగా రూ.48,390 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరాయి. 2018-22 సీజన్‌తో పోలిస్తే.. ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా బీసీసీఐ ప్రసార హక్కుల ద్వారా సంపాదించింది. స్టార్ ఇండియా ఒక్కో మ్యాచ్‌కు రూ.57.40 కోట్లు చెల్లిస్తుండగా.. జియో సినిమా ఒక్కో మ్యాచ్‌కు రూ.50 కోట్లు చెల్లిస్తోంది. అంటే మొత్తంగా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్ ద్వారా రూ.107.40 కోట్లు సమకూరుతుంది.
భారీగా పెరిగిన యాడ్ రేట్లు
ఐదేళ్ల మీడియా రైట్స్ కోసం రూ.వేల కోట్ల పెట్టుబడి పెట్టిన స్టార్ ఇండియా, వయాకామ్ 18 సంస్థలు రెండేళ్ల పాటు వేర్వేరుగా రెవెన్యూను సంపాదించుకున్నాయి. అయితే ఇటీవలే ఈ రెండు సంస్థలు కలిసిపోయి జియోస్టార్‌గా రూపాంతరం చెందాయి. జియో, డిస్నీ+హాట్‌స్టార్‌లు కలిసిపోయి జియో హాట్‌స్టార్‌గా మారింది. ఇప్పుడు ఈ రెండు సంస్థలు ఒక్కో మ్యాచ్‌పై కనీసం రూ.150 కోట్లు సంపాదిస్తే కానీ పెట్టిన పెట్టుబడి, ఖర్చులు తిరిగి రావు. 2018లో స్టార్ ఇండియా 10 సెకెన్ల యాడ్‌కు రూ.8 లక్షల వరకు చార్జ్ చేసేది. అప్పట్లోనే 125 బ్రాండ్లతో స్టార్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది యాడ్ రేట్లు భారీగా పెరిగాయి. టీవీల్లో 10 సెకెన్ల యాడ్ రూ.18 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు చార్జ్ చేస్తున్నారు. నిరుడు 10 సెకెన్ల యాడ్ రూ.16.4 లక్షలుగా ఉంది. ఇక ఓటీటీల్లో 10 సెకెన్ల యాడ్ గతేడాది రూ.6.5 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.9 లక్షల వరకు పెంచేశారు. గతంలో టీవీ రైట్స్, ఓటీటీ రైట్స్ వేర్వేరు సంస్థల వద్ద ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే సంస్థ కావడంతో గుత్తాధిపత్యం పెరిగిపోయింది. దీంతో జియోస్టార్ ఎంత రేటు చెబితే అంతకు కొనాల్సిందే. యాడ్స్ రేట్లు భారీగా పెరిగినా.. ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు యాడ్స్ కోసం రూ.కోట్లు కుమ్మరిస్తున్నాయి. గతేడాది స్టార్ స్పోర్ట్స్‌లో 546 మిలియన్ల వ్యూయర్‌షిప్ నమోదవ్వగా.. జియో సినిమాలో 620 మిలియన్ల వ్యూయర్‌షిప్ ఉంది.
ఆదాయం కూడా అంతే
ఐపీఎల్ 2025 సీజన్‌లో టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఆన్‌గ్రౌండ్ అడ్వర్టైజింగ్ ద్వారా రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేవలం టీవీ, ఓటీటీ యాడ్ల ద్వారానే రూ.8 వేల కోట్లను సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నది. గతేడాది టీవీ, డిజిటల్ రైట్స్ ద్వారా రూ.4,500 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే ఈ సారి యాడ్ రేట్లు పెంచడంతో ఆదాయం మరింతగా పెరుగుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత రెండేళ్లు జియో సినిమా ద్వారా ఉచితంగానే ఐపీఎల్‌ను స్ట్రీమింగ్ చేశారు. ఈ సారి జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లను ఫ్రీగా చూసే వీలు లేదు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోకతప్పదు. జియో హాట్‌స్టార్ మూడు నెలలకు రూ.149 సబ్‌స్క్రైబ్ ప్లాన్ అమలు చేస్తుంది. ఈ విధంగా కూడా జియో హాట్‌స్టార్ భారీగానే సంపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రాడ్‌కాస్టర్లు తమ యాడ్ రెవెన్యూను పెంచుకోవడానికి కొత్త పద్దతులను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పిచ్‌సైడ్ (బౌండరీ లైన్ల వద్ద) అడ్వర్టయిజింగ్‌లో.. వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రకటనలు వచ్చేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఫిఫా వరల్డ్ కప్‌ను ప్రపంచం అంతటా వీక్షిస్తారు. అదే సమయంలో ఒక్కో దేశానికి ఒక్కో బ్రాడ్‌కాస్టర్ ఉండటంతో పిచ్ సైడ్ అడ్వర్టయిజింగ్‌లో వేర్వేరు యాడ్స్ వచ్చేలా చేశారు. ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ప్రయోగం చేయాలని భావించినా.. బ్యాటర్లకు ఇబ్బందింగా ఉంటుందని వాడటం లేదు. అయితే ఫీల్డ్‌లో కనిపించే యాడ్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా మార్చుకునేలా చేసి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఎలాగూ గ్రౌండ్ పచ్చగా ఉండటంతో దాన్నే గ్రీన్ మ్యాట్‌లాగా ఉపయోగించి గ్రాఫిక్స్ ద్వారా యాడ్స్ వేస్తున్నారు. దీనికి కూడా భారీగా అమౌంట్ వసూలు చేస్తూ.. యాడ్ రెవెన్యూను భారీగా పెంచుకుంటున్నారు. దీనికి తోడు ఓటీటీల్లో వీక్షించే వారికి.. వారి వారి ప్రాంతాలను బట్టి యాడ్స్ భాష మార్పు చెందుతుంది. అంతే కాకుండా వీక్షకుడి అభిరుచుల మేరకు యాడ్స్ కూడా వస్తుంటాయి. టీవీల్లో మాత్రం అది సాధ్యం కాదు.
Read More : ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో పైసల వరద.. మంచి నీళ్లలా ఫ్రాంఛైజీల ఖర్చు