దొంగతనం చేసి తప్పించుకోవడం ఎలా..? ఇలా ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-03-06 16:28:36.0  )
దొంగతనం చేసి తప్పించుకోవడం ఎలా..? ఇలా ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
X

ఒక ఇంటిలోకి వెళ్లి ఎలా దొంగతనం చేయాలని సవాలక్ష రకాలుగా ఆలోచించే దొంగ.. ఒక్కసారైనా దొంగతనం చేశాక పోలీసులకు చిక్కితే తన పరిస్థితి ఏమవుతుంది? జైలుకు వెళ్తే తన కుటుంబానికి ఆసరా ఎవరు ఉంటారని అనుకుంటారా? అలా ఆలోచించకపోవడం వల్లనే నేరాలు మితిమీరుతున్నాయి. నేరం చేసేవారు ఎవరైనా తాము చట్టానికి దొరకమనే భరోసాతో ఉంటారు. కానీ, నేడు అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఇలా ఎన్నో అంశాలు నిందితులను చట్టం ముందు దోషిలా నిలబెడుతుంది. చిన్న కారణంతో చేసిన తప్పుకు జీవితాంతం జైలులో గడపాల్సి వస్తున్నదేనన్న కఠిన వాస్తవాలు అప్పుడు తెలిసివస్తాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు.. ఇలా ఎంతోమంది చట్టానికి దొరకమన్న భరోసాతో నేరాలు చేస్తూ.. చివరికి జైలుగోడల మధ్య బందీ అవుతున్నారు.

వివాహేతర సబంధాలు, కులాంతర ప్రేమ వివాహాలు, భూ పంచాయతీలు, డ్రగ్స్ డీలింగ్, ఆస్తి, కుటుంబ, దాయాదుల మధ్య పాలిపగలతో హత్యలు, దేశద్రోహం, గూఢచార్యం, పసిపాపలపై హత్యాచారాలు, సామూహిక దాడులు చేస్తూ చట్టం కళ్లు కప్పాలని చూస్తున్నారు. కానీ, పక్కా సాక్షాధారాలను పోలీసులు సేకరించి కోర్టుల్లో ప్రవేశపెడుతున్నారు. ముందుగా రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లి 2, నుంచి 3నెలల్లో బెయిల్‌పై బయటకు రాగానే, తాత్కాలిక సంతోషం వ్యక్తం చేస్తూ, ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుందనే విషయాన్ని మరిచిపోతున్నారు. కొంతమంది అదే శిక్షగా భావిస్తూ, 100కు 90శాతం మంది పాతనేరస్తులుగా మారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ మరోసారి కూడా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. చేసిన నేరాలపై కోర్టు వాయిదాలకు హాజరవుతూ, ఫైనల్ జడ్జిమెంట్ లో యావజ్జీవ శిక్షను న్యాయూర్తి ఫైనల్ చేసే ఓ గంట ముందు నుంచే నేరస్తుల్లో వారు చేసిన, చట్టవ్యతిరేక పనులపై ఎన్నడూ లేనంతా రియలైజ్ అవుతూ, జీవితకాలం జైలుకు వెళుతున్నారు. ఆ సమయంలో దోషుల తల్లిదండ్రులు, భార్య, పిల్లల ఆర్తనాదాలతో కోర్టు ఆవరణలు దద్దరిల్లిపోతున్నాయి. బతుకు జీవుడా అంటూ నేరస్తుల్లో కనిపించే పశ్చాత్తాపంతో అక్కడున్న వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నది.

జీవితం మొత్తం జైలునే..

యావజ్జీవ కారాగారశిక్షను యావజ్జీవ శిక్ష, జీవిత ఖైదు, యావజ్జీవ ఖైదు, లైఫ్ టైం జైల్ అని కూడా పేర్కొంటారు. యావజ్జీవ కారాగార శిక్ష ఖారారైన దోషులు జీవితం మొత్తం జైలులో గడపడమేనని భారత సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. యావజ్జీవ కారాగార శిక్ష ఖారారై, నిర్ణీతకాల జైలు శిక్ష తర్వాత పెరోల్‌ను అభ్యర్థించడానికి అధికారిక యంత్రాంగాల సహాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల శిక్షను తగ్గించే వ్యవధి, విధానాలు ఒక దేశం నుంచి మరో దేశానికి మారుతూ ఉంటాయి. అధికారం యంత్రాంగం పూర్వపరాలు పరిశీలించిన అనంతరం, సబంధిత వ్యక్తి కుటుంబీలకుతో గడపడానికి కొన్ని సెలవులు ప్రకటిస్తారు.

కొన్ని దేశాల్లో నిషేధం..

జీవిత ఖైదు అన్ని దేశాల్లో అమలులు లేదు. 1884లో జీవిత ఖైదును రద్దు చేసిన మొదటి దేశంగా పోర్చుగల్ చరిత్రకెక్కింది. ఆ దేశంలో సరసన మెక్సికో, స్పెయిన్, నార్వే, సెర్బియాతోపాటు పలు దక్షిణాసియా దేశాలు, మధ్య అమెరికా దేశాలు, మొజాంబిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యావజ్జీవ కారాగారశిక్ష లేదు. అంతర్జాతీయ క్రిమినల్ కోడ్ రోమ్ శాసనంలోని ఆర్టికల్ 110ప్రకారం యుద్ధ నేరాలు, మారణహోమం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తి కనీసం మూడింట రెండు వంతులు లేదా 25ఏండ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నది. ఈ క్రమంలో వారిని నమ్ముకుని జీవించే కుటుంబీకుల్లో తీవ్ర విషాదం నెలకొంటోంది. జైలుకు వెళ్లిన కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమవుతుండగా, మరికొందరూ జైలులో ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే క్రమంలో, జైలు, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఉన్న ఆస్తులను అమ్ముకుంటూ నిత్య విషాదంలో మునిగిపోతున్నారు.

జడ్జిపై చెప్పు విసిరిన నిందితుడు

హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో అత్తాపూర్ సిక్ గ్రామానికి చెందిన కరణ్ సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తి (22) పలు నేరాల్లో నేరస్థుడు. కాగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి12న రంగారెడ్డి జిల్లా 9వ అడిషనల్ సెషన్స్ జడ్జి హరీష నిందితుడికి జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు వెల్లడించారు. కరణ్‌సింగ్ జైలులో తనకు ఎదురువుతున్న ఇబ్బందులపై జడ్జికి వివరించే ప్రయత్నించే క్రమంలో ఒక్కసారిగా తన కాలుకు ఉన్న చెప్పును తీసి మహిళ జడ్జిపై విసిరాడు. పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోక కేసును నమోదు చేసి, అదే జైలుకు పంపించారు. ఇటువంటి ఖైదీలకు పెరోల్ ఇవ్వడానికి అధికారులు సహకరించబోరు. జైలులో ఎంత సత్ప్రవర్తనతో ఉంటే, అంతా లభం ఉంటుందని జైలు అధికారులు పేర్కొంటున్నారు.

తాత్కాలిక ఆనందం పెరోల్

యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న క్రమంలో, ఖైదీకి, బాధిత కుటుంబీకులకు తాత్కాలక ఆనందంగా పెరోల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం అంటుంది. ఈ అవకాశం దక్కించుకోవాలంటే జైలులో సప్రవర్తనతో తప్పనిసరిగా మెలగాలి. అయితే సాధారణ జైలు శిక్షలో ఎక్కువభాగం అనుభవించిన ఖైదీకి పెరోల్ మంజూరు చేస్తారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న వారు తాత్కాలికంగా సమాజంలోకి ప్రవేశించడానికి ఒక సౌకర్యంగా ఉపయోగపడుతుంది. ఖైదీలను సంస్కరించడానికి, సమాజంతో వారి నిరంతర సంబంధాన్ని గుర్తించడానికి ఇది ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. ప్రస్తుత వ్యవస్థలో, పద్దెనిమిది నెలలు దాటిన శిక్షలో మూడింట ఒక వంతు తర్వాత పెరోల్ అర్హత ప్రారంభమవుతుంది. పెరోల్ సమయం గరిష్టం ఒక నెల ఉంటుందని, దోషులపై ఇది మరింత మానవీయ దృక్పథంగా వ్యవహరిస్తుందని న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు.

ఫైనల్ జడ్జిమెంట్‌కు చేరువలో ప్రణయ్-మారుతీ రావ్ కేసు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసు కూడా ఫైనల్ రానున్నట్లు తెలుస్తున్నది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడు, అగ్ర కులానికి చెందిన అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మనుసులో పెట్టుకుని ప్రణయ్‌ను 14 సెప్టెంబర్ 2018న మారుతీరావ్ హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏ-1గా ఉన్న మారుతీరావ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసు తదిదశకు చేరుకుని, ఈ నెల చివరిలో కానీ, మార్చిలో కానీ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉన్నదని న్యాయవాదులు చర్చించుకుంటున్నారు.

పెరోల్‌కు కావాల్సిన అర్హతలు..

పెరోల్‌కు అనుమతించబడిన గరిష్ట వ్యవధి ఒక నెలగా ఉంటుంది. ఖైదీ కనీస జైలు శిక్ష అనుభవించాల్సిన షరతును నెరవేర్చాలి. కానీ, ఉగ్రవాదం, బహుళ హత్యలు, జాతీయ భద్రతకు ముప్పు మొదలైన నేరాలకు పాల్పడిన ఖైదీలు వంటి ఖైదీలలోని ఒక నిర్దిష్ట వర్గానికి పెరోల్ హక్కు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్దిష్ట సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలు దీనికి దరఖాస్తుచేసుకోవచ్చు.

ఏ సమయాల్లో పెరోల్

1) దగ్గరి కుటుంబ సభ్యునికి తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నప్పుడు

2) కుటుంబ సభ్యుడు మరణించిన సమయంలో

3) కుటుంబ సభ్యుడికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే

4) కుటుంబ సభ్యుని వివాహానికి ముందు..

5) ఖైదీ భార్య ప్రసవించిన సమయంలో..

6) ప్రకృతి వైపరీత్యం కారణంగా కుటుంబ సభ్యుని ప్రాణానికి లేదా ఆస్తికి తీవ్రమైన నష్టం కలిగినప్పుడు

పెరోల్ పొందడానికి అర్హతలు

1) నిర్దిష్టమైన జైలుశిక్షను పూర్తి చేసిన ఖైదీ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

2) అరెస్టు జరిగిన పోలీస్ స్టేషన్ నుంచి జైలుఅధికారి నివేదిక అడుగుతారు.

3) ఆ తర్వాత నివేదిక ధ్రువీకరించబడుతుంది.

4) వైద్యపరమైన అత్యవసర పరిస్థితి అయితే, సంబంధిత వైద్య రికార్డులు కూడా ధ్రువీకరించబడతాయి.

5) ఆ తర్వాత తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ లేదా జైళ్ల ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు సమర్పిస్తారు.

6) అప్పుడు సమర్థ అధికారి పెరోల్‌పై నిర్ణయం తీసుకుంటారు.

Next Story

Most Viewed