తెలంగాణలో గన్ కల్చర్ స్టార్ట్.. బిహార్‌ను తలపించేలా ఫైరింగ్‌‌లు

by Bhoopathi Nagaiah |
తెలంగాణలో గన్ కల్చర్ స్టార్ట్.. బిహార్‌ను తలపించేలా ఫైరింగ్‌‌లు
X

రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాల కేసులు గతేడాదితో పోలిస్తే 2024లో సుమారు ఆరు వేల కేసులు అధికంగా నమోదైనట్లు పోలీసు శాఖ నివేదికలు చెప్తున్నాయి. దొంగతనాల్లో గన్ కల్చర్ కూడా తాజా ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలోనే రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 2024లో దొంగతనాలపై 25,965 కేసులు నమోదయ్యాయి. గతేడాది 19,733 కేసులు నమోదయ్యాయి. ఇళ్లలో చొరబడి దొంగతనాలు జరిగిన ఘటనలో 5,724 కేసులు నమోదయ్యాయి. గతేడాది 4,803 కేసులు నమోదయ్యాయి. డెకాయిటీ కేసులు 58, రాబరీ 703 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలీస్తే ఈ సంవత్సరం అధికంగా కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. పోలీసు శాఖ వెల్లడించిన నివేదికల ప్రకారం 16శాతం పెరిగాయి. డి.రాంగోపాల్

ప్రభాకర్.. కలకలం

ప్రిజం పబ్‌ కాల్పుల కేసులో నిందితుడు బత్తుల ప్రభాకర్ గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్‌లో గుర్తించిన పోలీసులు అతనిని పట్టుకునే క్రమంలో పోలీసులపైన కాల్పలు జరిపి దొరికిపోయాడు. దొంగతనాలు చేసి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నెలకు రూ.3 వేల దొంగతనం నుంచి మొదలుపెట్టిన ప్రభాకర్.. ఒకేరోజు రూ.3 లక్షలు, ఆపై రూ.33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుని మరీ దొంగతనాలకు పాల్పడ్డాడు. కేవలం 11 చోరీల్లోనే రెండున్నర కోట్లు కొట్టేశాడు. రూ.333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ టార్గెట్‌గా తెలుస్తున్నది. కేవలం తొమ్మిదవ తరగతి వరకు చదివిన ప్రభాకర్ చిన్ననాటి నుంచే దొంగతనాలకు పాల్పడ్డాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్‌పై 80 కేసులు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపుతున్నాయి. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర రెడ్డి, రాజు వంటి మారుపేర్లతో హల్‌చల్ చేశాడు ప్రభాకర్.

కర్ణాటకలో చోరీ.. హైదరాబాద్‌లో కాల్పులు

కర్ణాటక బీదర్‌లో ఏటీఎంల్లో నింపాల్సిన రూ.93 లక్షలను పథకం ప్రకారం కొట్టేసిన దొంగలు అక్కడి నుండి పారిపోయి హైదరాబాద్‌ వచ్చారు. అఫ్జల్‌గంజ్‌లో ఏరియా కాల్పులతో కలకలం సృష్టించారు. అఫ్జల్‌గంజ్‌లో ట్రావెల్స్‌ బస్సును ఎక్కడానికి ప్రయత్నించారు. బస్సెక్కుతుండగా లగేజీని చెక్‌ చేయాలని జహంగీర్‌ అనే బస్సు క్లీనర్‌ చెప్పగా ఆగ్రహించిన దొంగలు తుపాకీతో అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బీదర్‌లో జరిపిన కాల్పుల్లో ఒక సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోగా.. మరో సెక్యూరిటీ గార్డు తీవ్రగాయాలతో చావుబతుకుల మధ్య ఉన్నాడు.

సొంత తమ్ముడే దొంగ

దోమలగూడ పీఎస్ పరిధిలో ఈ నెల డిసెంబర్‌లో సినీ ఫక్కీలో జరిగిన దోపిడీకి పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడు బాధితుడి సొంత తమ్ముడిగా పోలీసులు తేల్చారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన బంగారు నగలు తయారు చేసే వ్యక్తి ఒకరు హైదారాబాద్ లో స్థిర పడ్డాడు. అతని సోదరుడు కూడా ఇదే వృత్తిలో ఉన్నాడు. అయితే, అన్‌లైన్ గేమ్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి తీవ్రంగా నష్టపోయాడు. కష్టాలనుంచి ఆదుకోవాలని తన సోదురుడిని కోరినా.. అతను నిరాకరించడంతో వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే బంగారం దోపిడీ ఒక్కటే మార్గమని నిర్ణయించకున్నాడు. కొంతమందితో కలిసి సొంత అన్ననే దోచుకునేందుకు ప్లాన్ వేశాడు. కత్తులు, ఆయుధాలతో అన్నని గాయపరిచి, సుమారు 2 కేజీల బంగారు ఆభరణాలతో పారిపోయాడు. ఈ ఘనటపై దోమలగూడ పోలీసులు విచారణ చేయగా.. సొంత తమ్ముడే దోచుకున్నాడని తేలింది. 12 మందిని అరెస్టు చేసి వారినుంచి రూ.1.20కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వైరాలో సర్వే పేరుతో..

ఖమ్మం జిల్లా వైరాలో సర్వే పేరుతో ఇంట్లోకి ప్రవేశించి శీలం వెంకట్రావమ్మ అనే వృద్ధురాలిపై దాడి చేసి సుమారు రూ.15 లక్షల విలువ చేసే బంగారు నగలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. నలుగురు యువకులు మారుతి డిజైర్ కారులో శీలంవెంకట్రావమ్మ ఇంటికి వచ్చారు. సర్వే కోసం వచ్చామని నమ్మబలికారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమెపై దుప్పటితో ముసుగు వేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె కాళ్లు, చేతులను కట్టేసి.. కేకలు వేయకుండా నోటికి ప్లాస్టర్ వేశారు. అనంతరం బీరువాలో దాచిన రూ.15 లక్షలవిలువైన 18 తులాల బంగారు నగలను దోచుకున్నారు.

దొంగిలించిన సొమ్ముతో లగ్జరీ లైఫ్

గతంలో దొంగిలించిన సొమ్ముతో దొంగలు పరారయ్యేవారు.. లేదా దాచుకునే వారు. ప్రస్తుతం దొంగలు ట్రెండ్ మార్చారు. దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఖరీదైన అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటూ, ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. గర్లఫ్రెండ్స్‌కు ఖరీదైన గిఫ్టులు ఇస్తున్నారు. కేవలం జల్సా చేయడం కోసమే దొంగతనాలకు పాల్పడుతున్నరని పోలీసు విచారణలో తెలుస్తున్నది.

పట్టుబడిన దొంగల్లో 90శాతం మంది జల్సాలకు అలవాటు పడిన వారే కావడం గమనార్హం. ఇక ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయినవారు.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి దొంగతానలకు దిగుతున్నారు. ఈ తరహా హైదరాబాద్ నగర పరిధిలో నమోదైన కేసుల సంఖ్య హైదారాబాద్ కమిషనరేట్ పరిధిలో 1810, రాచకొండ 2065, సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలో 232 కేసులు నమోదు అయ్యాయి.

Next Story