- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిల్వర్ స్క్రీన్‌పై ఈ తరం ఫోక్ సింగర్స్ హవా
దిశ, ఫీచర్స్: వెండితెరపై జనపదాలకు పాటాభిషేకం జరిగితే.. తెలుగు లోగిళ్లలో జానపదానికి పట్టాభిషేకం జరుగుతోంది. మట్టిపరిమళాలు అద్దుకుని, చెమటచుక్కల్లో తడిసి, పల్లెగాలుల రథమెక్కి, స్వచ్ఛమైన బతుకుల్లో విరబూసిన పల్లెపాటలు చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘సారంగ దరియా, భలేగుందె బాల, రాములో రాములా, సిత్తరాల సిరపడు, నాదీ నక్కిలీసు గొలుసు, చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ వంటి పాటలు సెన్సేషన్‌గా నిలుస్తూ.. జనపదం ఉన్నంత కాలం జానపదం ఉంటుందని నిరూపిస్తున్నాయి. నాడు పల్లెలకే పరిమితమైన పదాలు, నేడు విశ్వవ్యాప్తమవుతూ గుండె గుండెనూ తట్టిలేపుతున్నాయి, గడపగడపనూ గజ్జె కట్టి ఆడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పున:వైభవం దిశగా సాగుతున్న అచ్చమైన మట్టిపదాలకు తమ మధురమైన గాత్రంతో ప్రాణం పోస్తూ.. ప్రేక్షకుల హృదయంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు ఫోక్ సింగర్స్. ఈ క్రమంలోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంటూ ‘మంగ్లీ, పెంచల్‌దాస్, రామ్ మిరియాల, మధుప్రియ’ వంటి సింగర్స్ మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ‘పల్లె పదాల’తో తెలియని అనుబంధం పెంచుకున్న ఆ పాటగాళ్లు.. ప్రాంతీయ యాస, భాషలను అక్కున చేర్చుకుని తమ స్వరాలతో ఊపిరిలూదారు. ఎట్టకేలకు సినీ కళామతల్లి ఆహ్వానాన్ని అందుకొని వెండితెరపై వెలిగిపోతున్నారు.
రామ్ మిరియాల..
‘చౌరస్తా బ్యాండ్’లో తెలంగాణ పదాలను ర్యాప్ స్టైల్లో పాడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యువ సింగర్ రామ్ మిరియాలకు టాలీవుడ్ అవకాశాలు తలుపుతడుతున్నాయి. ‘అర్రెరెరె జాతిరత్నాలూ.. ఎన్నడూ చూడని నవ్వుల వర్షాలు’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌కు ట్యూన్ అందించిన రామ్ మిరియాల పాడటం కూడా విశేషం. ఇక లేటెస్ట్ సెన్సెషన్ ‘చిట్టి పాట’ ఊరువాడల్లో మార్మోగిపోతుండగా, రామ్‌కు మరింత ఆదరణ తెచ్చిపెట్టింది. ‘పుష్పక విమానం’ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ‘సిలకా’ అనే పాట కూడా రామ్‌కు మంచి గుర్తింపునిస్తోంది. ఇక చౌరస్తా బ్యాండ్ నుంచి రిలీజై, కుర్రకారును ఓ ఊపు ఊపేసిన ‘మాయ మాయ’ పాట ‘బాయ్స్ యాంథెమ్’గా నిలిచింది. ఇదే క్రమంలో వచ్చిన ‘ఊరెళ్లిపోతా మామ’ పాట నేటి పల్లెల జీవనచిత్రాన్ని చూపించగా, కరోనా సయమంలో ‘చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా’ పాట జనాల్లో సామాజిక బాధ్యతను గుర్తుచేసింది. ఈస్ట్ గోదావరిలోని కోలంకాలో జన్మించిన రామ్.. తన పాటల్లో వాస్తవికతకు పెద్దపీట వేస్తూనే, పల్లెపదాలకు స్థానం కల్పిస్తుంటాడు. ఈ క్రమంలోనే పల్లెపాటలకు కొత్త గొంతుకయ్యాడు. రెండేళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్న రామ్, వ్యక్తిగత కారణాల వల్ల సంగీతాన్ని కొనసాగించలేకపోయాడు. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు రేడియో స్టేషన్‌లో ప్రోమో ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు.
మంగ్లీ..
అనంతపురం జిల్లా, బసినేపల్లె తండాలోని ఓ బంజారా కుటుంబంలో జన్మించిన మంగ్లీ.. చిత్రపరిశ్రమలో అనతికాలంలోనే ఫోక్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా మారింది. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సుతో పాటు కర్నాటక సంగీతం కూడా నేర్చుకున్న మంగ్లీ అసలు పేరు సత్యవతి. తాతమ్మ పేరును తన పేరుగా మార్చుకున్న సత్యవతి ‘మాటకారి మంగ్లీ’ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘తీన్మార్’తో మంగ్లీకి పేరు వచ్చినా, పాటల కోసం ఆ అవకాశాన్ని వదులుకుని యూట్యూబ్ కోసం పాటలు పాడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే బతుకమ్మ, మహాశివరాత్రి, సంక్రాంతి సందర్భంగా ఆమె పాడిన పాటలు తనను సూపర్ సింగర్‌ను చేయడంతో పాటు సినిమా అవకాశాలూ తెచ్చిపెట్టాయి. ‘పార్వతీ తనయుడవో, శైలజరెడ్డి అల్లుడు చూడే, వాడు నడిపే బండి’ పాటలు మంగ్లీకి మంచి పేరు తీసుకురాగా.. ‘రాములో రాములా’ పాట మంగ్లీ కెరీర్‌ను పతాకస్థాయికి తీసుకెళ్లింది. ఇటీవలే విడుదలైన ‘భూమ్ బద్దల్, జ్వాల రెడ్డి, ఊరంతా’ పాటలు మంచి సక్సెస్ సాధించగా ‘సారంగ దరియా’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తీన్మార్ కార్యక్రమానికి గాను ఎంటర్‌టైన్‌మెంట్ యాంకర్‌గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకున్న మంగ్లీ.. 2020లో ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. ఓ మారుమూల పల్లె నుంచి వచ్చిన మంగ్లీ, నేడు గడపగడపకి చేరవయ్యేంత వరకు ఆమె ప్రస్థానంలో ఎన్నో కష్టనష్టాలుండగా.. అంతులేని ఆత్మవిశ్వాసం, గుండెలనిండా ధైర్యంతో ఆమె సాగించిన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
పెంచల్‌దాస్..
‘ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ’ అంటూ పెంచల్ దాస్ పాడుతుంటే.. బరువెక్కని హృదయాలుండవు. ఆ గాత్రమే ‘దారి చూడు దమ్ము చూడంటే’.. కాలు కదపకుండా ఉండలేం. ‘మరుగైనావా రాజన్న, యాడ పోయినాడో, సిత్తరాల సిరపడు, భలేగుంది బాలా’ పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సాధించాయి. పదాలు అల్లడంలోనే కాదు, ఆ పదాలకు తన స్వరంతో ప్రాణాలు పోయడం పెంచల్ దాస్‌కు పుట్టుకతోనే అబ్బిన విద్య. తెలుగు రాష్ట్రాల్లో ఈ పల్లె పాటగాడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, థమన్‌తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ‘పెంచల్ దాస్’ స్వరాన్ని, కలాన్ని ఇష్టపడతారు. రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలీకాన్ని నేటి తరానికి చేరువ చేస్తున్న కృషి అభినందనీయమంటూ పెంచల్ దాస్‌ను కొనియాడారు పవన్ కల్యాణ్. రాయలసీమ పల్లెల్లోని జానపద గేయాలన్నింటినీ సేకరించడంతో పాటు స్వయంగా జానపదాలు రాస్తూ రత్నాల సీమకు వన్నె తెస్తున్న పెంచల్ దాస్.. కడప జిల్లాలోని దేవమాచపల్లిలో జన్మించాడు. ఇక పెంచల్‌దాస్ తన బాటిక్ కళకు గాను రాష్ట్రస్థాయి అవార్డును గెలుచుకున్నాడు.
మధుప్రియ
‘ఆడపిల్లనమ్మా’ అంటూ తొమ్మిదేళ్లకే తన పాటల ప్రస్థానం మొదలుపెట్టి.. ‘వచ్చిండే మెల్లమెల్లగ వచ్చిండే’ అంటూ తెలుగు ప్రేక్షకులను తన గాత్రంతో ఫిదా చేసింది మధుప్రియ. చిన్ననాటి నుంచే జానపద పాటలు పాడుతున్న మధుప్రియ, తెలంగాణ ఉద్యమంలోనూ చురుకైన పాత్ర పోషించింది. తన పాటలతో ఉద్యమకారులను కదం తొక్కించింది. ఈ క్రమంలోనే చిత్రపరిశ్రమ ఆహ్వానం అందుకుని అక్కడ కూడా తన ప్రతిభ చాటుతోంది. అంతేకాదు కమర్షియల్ సాంగ్స్ కూడా పాడుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
ఇక ఆర్. నారాయణమూర్తి తీసిన ప్రతి సినిమాలోను రెండు మూడు జానపదగీతాలు తప్పనిసరిగా మనకు వినిపిస్తాయి. ఈ క్రమంలో పైడి జయరాజ్, గూడ అంజన్న, గద్దర్, గోరటి వెంకన్న, వరంగల్ శంకర్‌లు జానపదాలకు తమ స్వరంతో అభిషేకం చేయగా, యంగ్ జనరేషన్‌లోనూ సాయిచంద్, గిద్దె రాంనర్సయ్య వంటి సింగర్స్ తమ గాత్రంతో మట్టిపదాలకు సొబగులు అద్దుతుతున్నారు. ఈ క్రమంలోనే ఫిల్మ్ మేకర్స్ ప్రస్తుతం ఫోక్ సాంగ్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.