- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సాహితీవరం.. సురవరం
దిశ, మహబూబ్ నగర్ : సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహితీరంగంలో శిఖరసమానుడు. తెలంగాణ మాగాణంలో అక్షర సేద్యం చేసిన కృషీవలుడు. రచయితగా, పండితుడిగా, చరిత్ర పరిశోధకుడుగా, పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, స్వాతంత్య్రోద్యమకారుడిగా అన్ని రంగాలలో తనదైన ముద్రను వేసి భావి తరాలవారికి ఆదర్శంగా నిలిచారు. నేడు(మే28) సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ‘దిశ’ అందిస్తున్న ప్రత్యేక కథనంలో ఆయన జీవితవిశేషాలు … సురవరం జన్మస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని బోరవెల్లి గ్రామం. క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, చిన్నాన్న ప్రోత్సాహంతో స్వగ్రామంలో ప్రాథమికవిద్యను కొనసాగించి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ, తిరువాన్‌కూరులో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. నిజాం రాష్ట్రంలో ఉండడం వల్ల ఉర్దూ తప్పనిసరిగా వచ్చేది. తెలుగు, సాంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పాండిత్యం సంపాదించారు. 1916లో పద్మావతిని పెండ్లి చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. సురవరం చదువు పూర్తి కాగానే జీవనాధారం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. ఆనాటి హైదరాబాద్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి రెడ్డిహాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. కొత్వాల్ కోరిక మేరకు రెడ్డిహాస్టల్‌కు 10 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఉన్న విద్యార్థులందరిలోనూ దేశభక్తి భావాలను పెంపొందించి, ఇక్కడి నిజాం రాష్ట్ర ప్రజల దుస్థితిని మార్చాలన్న సంకల్పంతో పనిచేశారు. సామాజికపరంగా, రాజకీయంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాధనంగా పత్రికారంగాన్ని ఎంచుకున్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రాంతీయ వార్తలు కూడా మీజాన్, జమీన్, రయ్యత్ వంటి పత్రికల్లో ఉర్దూలోనే ప్రచురితమయ్యేవి. గోలకొండ పత్రికకు ముందు రెండు పత్రికలు ఉండేవి. ఒకటి నల్లగొండ, మరొకటి వరంగల్లు నుండి వెలువడేవి. సురవరం ఎంతో ధైర్యంతో గోలకొండ పత్రికను 1926లో ప్రారంభించారు. సురవరం సంపాదకీయాలు ప్రజల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలనే ధైర్యాన్ని ఇచి నిజాం గుండెల్లో దడ పుట్టించారు. ఈ కారణంగానే సంపాదకీయాలు సమాచారశాఖ అనుమతితో ప్రచురించాలనే నిబంధన పెట్టడం జరిగింది. ఆ నిబంధనను సురవరం చాలా తేలికగా తీసుకొని, ప్రపచంలోని మేధావుల గొప్ప గొప్ప సూక్తులతో సంపాదకీయం పుటను ప్రచురించారు. అన్ని రకాల అవరోధాలను అధిగమించి పత్రికను సుమారు 24 సంవత్సరాలు నడిపారు. కొన్ని సంవత్సరాలు న్యాయవాద వృత్తిని చేపట్టి అనేక కేసులు వాదించి విజయం సాధించారు.
సురవరం రచనలు
సురవరం ప్రతాపరెడ్డి రచనలు అన్నీ విశిష్టమైనవే. సుమారు 40 వరకు వీరి రచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కో రచనకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వీరి రచనల్లో ఇతిహాస పురాణాలకు సంబంధించినవి, మన ధర్మానికి సంబంధిం చినవి, సమకాలీన సామాజిక స్థితిగతులకు అద్దం పట్టేవి ఉన్నాయి. పద్యం, కవిత్వం, కథలు, నాటకాలు, వ్యాసాలు ఆయా ప్రక్రియల్లో ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది. ఆయన రచనల్లో ముఖ్యమైన వాటిలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, సురవరం కథలు, మొగలాయి కథలు, హైందవ ధర్మవీరులు, సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు, సురవరం కవిత్వం, ఉచ్ఛల విషాదము (నాటకం), శుద్ధాంతకాంత (నవల, అముద్రితం), భక్త తుకారాం (నాటకం), గోలకొండ కవుల సంచిక (సంపాదకత్వం), ప్రజాధికారములు, యువజన విజ్ఞానం.
గోలకొండ కవుల సంచిక (సంపాదకత్వం) :
తెలంగాణ ప్రాంతంలో కవులు పూజ్యమన్న ఒక పండితుని వాక్యాలకు చాలా బాధపడి సురవరం వారు ఇక్కడి ప్రాంత అస్థిత్వాన్ని సాహిత్యలోకంలో నిరూపించే క్రమంలో చేసిన సాహసోపేతమైన కార్యానికి ప్రతిరూపమే గోలకొండ కవుల సంచిక. ఈ సంచిక ద్వారా తెలంగాణ ప్రాంతంలో వెలుగుచూడని ప్రతిభామూర్తులను, భిన్న కోణాల్లో వారి ఆలోచనలను వెలుగులోకి తెచ్చారు. 354 మంది రచనలు 11 శాఖలుగా విభజించుకుని మొత్తం 1418 పద్యాలను ఇందులో ముద్రించారు. ఇంకా చాలామంది కవుల పద్యాలు, కవితలు ఇందులో గడువు లోపల రాలేనందున ప్రచురించలేకపోయారు.
శాసన సభ్యుడిగా
1952లో హైద్రాబాద్ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు పోచేెసి విజయం సాధించారు. తెలంగాణాలో భాషాభిమానాన్ని, ఉద్యమస్ఫూర్తిని, సామాజిక చైతన్యాన్ని, రాజకీయ స్థిరతను సాధించే ప్రయత్నం చేసి సఫలీకృతుడైన సురవరం ప్రతాప రెడ్డి 1953 ఆగస్టు 25న కన్నుమూశారు.