- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కోరల్లో విశాఖ..!
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖపట్టణం పానిక్ బటన్ నొక్కేసింది. కరోనా వ్యాప్తి వార్తలతో పాటు పుకార్లు షికార్లు చేసి, వైజాగ్ వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వైజాగ్‌లో కేసు బయటపడడంతో ఉత్తరాంధ్ర కూడా వణికిపోతోంది. కరోనా కేసు నమోదైన నాటి నుంచి వైద్య ఆరోగ్య, పోలీసు, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు భయాందోళనలకు దారితీశాయి. కరోనా భయంతో వైజాగ్ నిర్మానుష్యంగా మారుతోంది.
కరోనా ఎలా సోకిందంటే…
విశాఖపట్టణంలోని అల్లిపురానికి చెందిన కరోనా సోకిన వృద్ధుడు, అది సోకడానికి ముందు ఫిబ్రవరి 21న జెద్దా నుంచి మక్కాకు, అక్కడి నుంచి మదీనాకు విమానాల్లో ప్రయాణించారు. తిరిగి మక్కా నుంచి మార్చి 9న హైదరాబాదుకు వచ్చారు. 10న హైదరాబాదులోని మెహదీపట్నంలో నివాసం ఉంటున్న కుమార్తె ఇంటికి వెళ్లారు. 11న కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో బీ1 బోగీలో వైజాగ్ వచ్చారు. 12న వైజాగ్‌లోని అల్లిపురంలోని సొంతింటికి వెళ్లారు. మక్కా నుంచి రావడంతో వారిని కలిసేందుకు పలువురు బంధువులు, మిత్రులు వారింటికి వచ్చారు. ఆయన 13న శుక్రవారం దగ్గర్లోని మసీదులో సామూహిక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. 14న అతనికి జ్వరం వచ్చింది. సాయంత్రం దగ్గర్లోని ఓ ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. జ్వరం తగ్గకపోగా, పెరిగిపోవడంతో 17న మర్రిపాలెంలోని వైద్యుడి క్లినిక్‌కు వెళ్లారు. అక్కడ ముగ్గురు వైద్య సిబ్బందిని కలిశారు. మరోసారి అతని నుంచి నమూనాలు సేకరించి, అనుమానంతో ఛాతీ ఆసుపత్రికి పంపించారు. ఇంతలో రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్ వచ్చింది.
ఎవరెవరు కలిశారంటే…
మక్కా నుంచి వచ్చిన తరువాత అతని 58 ఏళ్ల భార్యకు కూడా కరోనా సంబంధిత లక్షణాలు బయటపడ్డాయి. అక్కడికి వెళ్లి వచ్చిన నాటి నుంచి నేటి వరకు వారి 18 ఏళ్ల కుమార్తె కూడా వారితోనే ఉంది. గోపాలపట్నంలో ఉంటున్న అతని తల్లి, ఇద్దరి సోదరులు కూడా వారితో సన్నిహితంగా మెలిగారు. మర్రిపాలెంలో అతనిని పరీక్షించిన వైద్యుడు ఇప్పటికే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఛాతీ ఆసుపత్రిలో చేరిన తరువాత సరైన రక్షణ సామగ్రి ధరించకుండా వైద్యమందించిన నర్సు కన్నీరుమున్నీరవుతోంది. ఛాతీ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా విధుల్లో ఉన్నవారంతా ఇళ్లకు వెళ్లకుండా ఆసుపత్రిలోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.
వైద్య ఆరోగ్య, పోలీసు, మున్సిపల్ శాఖలు ఏంచేశాయంటే…
మరోవైపు వారు నివాసం ఉంటున్న అల్లిపురం ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవర్నీ బయటకు రానివ్వడం లేదు. ఇప్పుటికే ఆ ప్రాంత వాసులందర్నీ అప్రమత్తం చేశారు. వృద్ధుడ్ని కలిసిన వారందర్నీ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లమన్నారు. మసీదులో ప్రార్ధనలు జరిపిన వారందర్నీ జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా భయపడకుండా ఛాతీ ఆసుపత్రికి రావాలని చెబుతున్నారు. అల్లిపురంలోని అతని ఇంటికి 3 కిలోమీటర్ల పరిధిలోని వారందర్నీ అంటే 7050 ఇళ్లలో సర్వే చేసి, వైద్యపరీక్షలు నిర్వహించారు. అనుమానితుల రక్తనమూనాలు సేకరించి పరిశోధనకు పంపారు.
లోపం ఎక్కడ జరిగిందంటే..
వృద్ధుడు ప్రయాణించిన మార్గమంతా లోపాల మయమే.. వృద్ధుడికి మక్కాలోనే కరోనా సోకి ఉంటుంది. అక్కడి నుంచి జెద్దాకు, జెద్దా నుంచి హైదరాబాదుకు విమానంలో వచ్చారు. ఈ విమానాశ్రయాల్లో సరైన పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ మహమ్మారి ముందే బయపడి ఉండేది. కనీసం హైదరాబాదు విమానాశ్రయంలో సరైన పరీక్షా విధానం అమల్లో ఉండి ఉంటే.. కరోనా వైజాగ్ వరకు వచ్చి ఉండేది కాదు కదా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోవైపు వృద్ధుడు మక్కా నుంచి వచ్చిన నాటికి కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలి భయపెడుతోంది. విదేశాల నుంచి వచ్చానన్న సామాజిక స్పృహతో వ్యవహరించి ఎవరినీ కలవకుండా ఉండి ఉంటే.. వైజాగ్ ఈ మహోత్పాతం నుంచి తప్పించుకుని ఉండేది.
వైజాగ్‌లో ఇప్పుడు పరిస్థితి ఏంటి?
వైజాగ్‌లో అదుగో తోక అంటే ఇదిగో పులి అన్న చందాన.. అక్కడ కరోనా బయటపడిందట అంటే ఇక్కడ కూడా కరోనా సోకిందట.. ఆ ఆసుపత్రిలో కరోనా రోగులు చేరారట.. అంటే ఈ ఆసుపత్రిలో ఇన్ని కేసులు ఉన్నాయట అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కలెక్టర్ రంగంలోకి దిగి వైజాగ్‌లో ఒకే ఒక్క కేసు నమోదైంది. భయపడాల్సిందేమీ లేదని ప్రకటించారు. కరోనా బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసిపోయినందున వారందన్నీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంచారు?, వారిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు?, వంటి వివరాలేవీ కలెక్టర్ వెల్లడించలేదు. దీంతో అవగాహనారాహిత్యంతో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
వైజాగ్ వాసులు ఏం చేయాలి?
వైజాగ్‌లో ప్రస్తుత భయాందోళనల నుంచి రక్షణ పొందాలంటే.. ఎవరికి వారుగా, స్వచ్ఛందంగా ఎవరిళ్లలో వారు సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోవాలి. వీలైనవాళ్లంతా సోమవారం ఉదయం వరకు.. కుదరని వాళ్లు ఆదివారం సాయంత్రం వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలి. మరో వారం రోజుల వరకు పరిమిత సంఖ్యలో, తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే ఇతరులను కలవాలి. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేడి ఆహారపదార్థాలు, నీరు మాత్రమే తీసుకోవాలి. చేతులను వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. చేతల్లో పరిశుభ్రత పాటించాలి. అనవసరమైన పుకార్లపై శ్రద్ధ పెట్టడం మానెయ్యాలి. ఇలా చేస్తే కరోనా నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
Tags: visakhapatnam, corona, covid-19, panic,