'బిగ్ బాస్'.. భావోద్వేగాల ఆటలో బలిపశువులవుతున్న కంటెస్టెంట్స్

by Anukaran |
బిగ్ బాస్.. భావోద్వేగాల ఆటలో బలిపశువులవుతున్న కంటెస్టెంట్స్
X

దిశ, ఫీచర్స్: బయటి ప్రపంచంతో, మనుషులతో సంబంధం లేదు. బంధాలు, బంధుత్వాలకు మించి బాండింగ్ పార్టనర్‌గా మారిన ఫోన్‌‌తో కనెక్షన్ లేదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రా కరువే. అలాగని స్తబ్దుగా ఓ మూలన కూర్చుంటే కుదరదు. ఎగరాలి, దుమకాలి.. టాస్కుల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. అయినా వెంటాడే నామినేషన్లు, ఎలిమినేషన్లు. తోటి కంటెస్టెంట్ల కుట్రలు, పన్నాగాలు, క్యారెక్టర్ అసాసినేషన్.. వెరసి ‘బిగ్ బాస్’ రియాలిటీ షో వేదికగా కనిపించే దృశ్యాలు దాదాపు ఇవే. మనుషుల రియల్ ఫేస్ ఆవిష్కరించే కాన్సెప్ట్‌తో డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందినా.. ఇంచుమించు ఐసోలేటెడ్ కండిషన్స్‌లో కంటెస్టెంట్స్ జర్నీ అంత సులభం కాదు. అప్పటిదాకా హుందాగా, గంభీరంగా ప్రవర్తించిన అభ్యర్థులు ఒక్కసారే సహనం కోల్పోయి మాటలతో విరుచుకుపడటం లేదా భావోద్వేగంతో విలపించడం చూసే ఉంటారు. అలాంటి కఠిన పరిస్థితులను క్రియేట్ చేసి, డ్రామా సృష్టించడమే నిర్వాహకుల పని. కానీ కంటెస్టెంట్లలో తలెత్తే ఎమోషన్స్ ప్రేక్షకుల దృష్టిలో మైనస్‌గా మారొచ్చు. షో తర్వాత వ్యక్తిగత కక్షలకు ఆస్కారం కల్పించడమే కాక మానసికంగా తీరని నష్టాన్ని కలిగించవచ్చు. ఈ మేరకు గత సీజన్లలో బిగ్ బాస్‌లో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లతో పాటు సైకాలజిస్టుల అభిప్రాయాలు మీకోసం..

హిందీ బిగ్ బాస్‌తో పోలిస్తే తెలుగు బిగ్ బాస్ హౌజ్ చాలా కూల్ అయినప్పటికీ… నాని హోస్ట్ చేసిన సెకండ్ సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కౌశల్, హీరో తనీష్ మధ్య బిగ్ వార్ జరిగింది. ప్రతీ టాస్క్‌లో హౌజ్ మేట్స్ అందరూ ఒకటై కౌశల్‌ను టార్గెట్ చేయడం, తనను ఎమోషనల్‌గా టచ్ చేయడం వంటివి ఆడియన్స్‌ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తన ప్లేస్‌లో మరొకరు ఉంటే లో అయిపోయి, లోన్లీగా ఫీల్ అవుతూ, డిప్రెషన్‌లోకి వెళ్లేవారేమో కానీ కౌశల్ మాత్రం స్టేబుల్‌గానే ఉంటూ డీల్ చేశాడు. అది తన మానసిక సామర్థ్యానికి పరీక్షగా మారి.. ఆడియన్స్‌ను తన ఫ్యాన్స్‌గా మార్చేసింది. ఈ సీజన్‌లో కౌశల్ విన్నర్ కాగా తనీశ్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు.. ఫ్యాన్ వార్స్.. కేవలం బిగ్ బాస్‌తో మాత్రమే ఎండ్ కాలేదు. తర్వాత కూడా కంటిన్యూ అయ్యాయి.

ఆక్రోశం తన్నుకొస్తే..

హిందీ బిగ్ బాస్ OTT విన్నర్‌గా నిలిచిన దివ్య అగర్వాల్.. హౌస్‌లో కొంతకాలం మానసిక క్షోభ అనుభవించింది. ఏకంగా హోస్ట్ కరణ్ జోహార్ తనను తిట్టిన సందర్భాలున్నాయి. కానీ ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు బలంగా పోరాడిన దివ్య తన స్వీయ అనుభవాలను పంచుకుంది. ‘నిజాయితీగా చెప్పాలంటే.. ఇంట్లో భయంకరమైన దాడి లేదా ప్రతికూల పరిస్థితులు ఒత్తిడికి గురిచేస్తాయి. ప్రపంచం మొత్తం మిమ్మల్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆక్రోశం తన్నుకొచ్చినపుడు మన ఎమోషన్ తప్పకుండా బయటపడుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఓ నలుగురు వ్యక్తులుంటే వారు చెప్పింది వినాల్సి వచ్చినప్పుడు మితిమీరి స్పందించాల్సిన అవసరం ఉండదు. కానీ దేశం మొత్తం చూస్తున్న బిగ్ బాస్‌లో అలా కుదరదు. అయితే BB ఇంట్లో లేదా బయటి ప్రపంచంలోనైనా.. ఎవరూ కూడా మీతో చిరకాలం ఉంటారనే గ్యారెంటీ లేదు. ఒత్తిడికి గురైనప్పుడు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే సరైన పరిష్కారం’ అని వెల్లడించింది.

ఏదీ చేతుల్లో ఉండదు..

BB హౌస్‌కు మూడుసార్లు వెళ్లిన కాష్మేరా షా.. షోలో పాల్గొనాలంటే కంటెస్టెంట్ ప్రస్తుత వ్యక్తిగత స్థితి ఎంత ముఖ్యమో వివరించింది. ‘నేను చివరిసారి హౌస్‌లోకి వెళ్లే ముందు రెండు వారాల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి రావడంతో పిల్లలను చూడలేకపోయాను. నా పుట్టినరోజున సైతం ఒంటరిగా గడపాల్సి వచ్చింది. ఇక హౌస్‌లోకి వెళ్లే సమయానికి అప్పటికే కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నాను కాబట్టి బాగా నటించలేకపోయా. పెద్ద ఫైటర్‌గా ఉండి, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్న నేను ఏమీ చేయలేకపోయాను. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారంతా దాదాపు అపరిచితులే. వారంతా మీకు వ్యతిరేకంగా ప్లాన్‌ వేస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా అన్యోన్యంగా ఉన్న వ్యక్తులే ఎలిమినేషన్‌కు నామినేట్ చేస్తారు. నిత్యం పర్ఫార్మెన్స్‌పై కాన్సంట్రేట్ చేయడంతో 24 గంటలు కూడా 60 గంటలుగా కనిపిస్తాయి. అందుకే ఎమోషన్స్‌కు లోనవుతారు. ఇక సెలబ్రిటీలు నేషనల్ టీవీలో అన్ని కెమెరాల ముందు లైవ్‌లీగా ఉండటం సులభం కాదు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులకు కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. తమను తాము నిరూపించుకోవాలని, తమను ఇష్టపడాలని కోరుకుంటారు. కానీ హౌస్‌లోకి వెళ్లాక ఏదీ వారి చేతుల్లో ఉండదు’.

నియంత్రణ కోల్పోతారు..

ఒక్కసారిగా బర్‌స్ట్ అవడం అనేది అణచివేయబడిన భావోద్వేగాలు, డిఫెన్స్ చేసుకునేందుకు ఒక రూపం. ప్రతీ వ్యక్తి వారి సొంత భావోద్వేగాలతో వస్తారు. షోలో భాగంగా వస్తువులను పొందేందుకు లేదా పరిమిత సౌకర్యాలతో జీవించేందుకు గేమ్‌లో పోరాడాల్సి వచ్చినపుడు అప్పటిదాకా అణచివేయబడిన భావోద్వేగాలు, భావాలు బయటికొస్తాయి. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు తమ తెలివిపై నియంత్రణ కోల్పోతారు. సరిగ్గా అప్పుడే వారి రియల్ లైఫ్ ఫ్రస్ట్రేషన్స్ ప్రదర్శిస్తారు. షోకు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మాట్ ఇదే. అయితే ఈ పరిస్థితుల నుంచి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే మీరు వినోద ప్రదర్శన కోసం ఇంట్లో ఉన్నప్పటికీ అది నిజమైన అనుభవంగా అనిపిస్తుంది.
-సులగ్నా మోండల్, సైకియాట్రిస్ట్

కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు..

కొంత కాలం క్రితం సెట్స్‌లో మానసిక ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ టీమ్‌లో సైకాలజిస్ట్‌లు ఉండేవారు. బిగ్ బాస్‌లో ఇలాంటి క్షణాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకరు కన్నీళ్లు పెట్టుకోవచ్చు లేదా ఉల్లాసంగా ఉండొచ్చు. ఈ మేక్-బిలీవ్ ప్రపంచంలో పాల్గొన్న కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలుతుంటాయి. ఒక చిన్న డిజప్పాయింట్‌మెంట్ కూడా మనస్సులో గ్రెనేడ్‌గా పేలి నష్టాన్ని కలిగించవచ్చు. – డాక్టర్ హరీష్ శెట్టి, సీనియర్ సైకియాట్రిస్ట్

Advertisement

Next Story