- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే సడలింపులకు ఓకే చెప్పాం: ఇంటర్వ్యూలో ఈటల
దిశ, న్యూస్ బ్యూరో: “కరోనా.. ఒక ఊహించని ఉపద్రవం. తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. వైరస్‌ను కట్టడి చేయడానికి లాక్‌డౌన్ అవసరమే అయినా ఇళ్ళకే పరిమితం అయిన పేదల కడుపు నింపే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. దీర్ఘకాలం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే పేదలకు ఉపాధి పోతుంది. ఆంక్షలను ఎత్తివేస్తే కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వానికి ఒక సవాలు వంటిది. ఒకవైపు లాక్‌డౌన్ వల్ల జరిగే ఆకలి చావులు మరోవైపు కరోనాతో ఏర్పడే మరణాలు మొత్తం ప్రపంచ దేశాలనే కుదిపేస్తోంది. ప్రజల బాధలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అనుక్షణం కరోనాపై రివ్యూ చేస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. దాని ఫలితమే మరే రాష్ట్రంతో పోల్చుకున్నా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రజల్లో కాన్ఫిడెన్స్‌ను గణనీయంగా పెంచగలిగాం. ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు రోజుల వ్యవధిలోనే టిమ్స్‌ను తీర్చిదిద్దాం. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు పనిచేస్తున్నాం” అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ‘దిశ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్‌వ్యూలో పేర్కొన్నారు.
ప్రశ్న : రాష్ట్రంలో తొలి కరోనా కేసు వచ్చినప్పుడు మంత్రిగా మీ ఆందోళన ఎలా ఉంది?
జవాబు : తొలి కేసు వచ్చినప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఆందోళన కలిగింది. ఇకపైన మంత్రిగా చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి వచ్చాను. నిజానికి చైనాలోని వూహాన్‌లో వైరస్ వార్త వినగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందుకు కారణం మన రాష్ట్రంలో పేదలు ఎక్కువ. మురికివాడలు, బస్తీలు ఎక్కువ. ఇలాంటి చోట్ల వస్తే పరిస్థితి ఎట్లుంటుందో అనే ఆందోళన ఉంది. మన దేశ జనాభా కూడా చాలా దేశాలతో పోలిస్తే ఎక్కువే. కంట్రోల్ చేయడం ఎలా అనే అంశంపైనే ఆలోచనలు ఉండేవి. ఆ తర్వాతి కాలంలో ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లోని పరిస్థితి చూసిన తర్వాత వెంటనే సీఎం స్పందించారు. మన దేశంలో అప్పటికే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా వచ్చింది. వేరే దేశాల నుంచి విమానాలు వస్తాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖలతో స్వయంగా ముఖ్యమంత్రే మీటింగ్ పెట్టి చర్చించారు. ఆ విధంగా మనం కరోనా కేసులు వస్తే ఎలా ఎదుర్కోవాలనేదానిపై సన్నద్ధంగానే ఉన్నాం.
వైద్యారోగ్య మంత్రిగా మీ బాధ్యతను ఎలా గుర్తించారు?
అన్ని జాగ్రత్తలూ తీసుకున్నందున తొలి కేసు వచ్చిన రెండు వారాల వరకూ పరిస్థితి అదుపులోనే ఉందనిపించింది. కానీ, కరీంనగర్‌లో ఇండోనేషియా పౌరులకు పాజిటివ్ వచ్చిందని తెలియగానే ఒక్కసారిగా ఆందోళనపడ్డాను. నిజానికి ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అందులో ఒక మంత్రిగా నా ఆందోళన నాకుంది. వివిధ శాఖలతో సమన్వయం చేయడం మొదలుపెట్టాం. పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం ఇండోనేషియా పాజిటివ్ పేషెంట్లతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్నవారిని వెంటాడి, వేటాడి ఆరా తీశాయి. వారందరినీ క్వారంటైన్‌లో పెట్టి పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలించాం. చికిత్సతో కోలుకుని డిశ్చార్జి అయిన తర్వాత ఆందోళన తగ్గింది. ఈ రెండున్నర నెలల అనుభవంలో మనం తీసుకున్న జాగ్రత్తల వలన ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత నష్టం ఇక్కడ జరగలేదని తేలిపోయింది.
తక్కువ బడ్జెట్, మౌలిక సదుపాయాలతో ఎలా నెట్టుకొస్తున్నారు?
మన రాష్ట్రమే కాదు… కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి చేస్తున్న కేటాయింపులు తక్కువే. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు కూడా తక్కువే. అందుకే ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఆ లోటు తెలుస్తుంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వ అంగాలు మరింత సమర్ధవంతంగా పనిచేయక తప్పదు. క్రైసిస్ మేనేజ్‌మెంట్ విషయంలో మరింతగా చొరవ తీసుకోక తప్పదు. తెలంగాణ ప్రభుత్వంలో ‘నో’ అనేది రాకూడదు. ఎక్విప్‌మెంట్, మ్యాన్‌పవర్, మందులు… ఇలా ఏ రకంగానూ ఇబ్బందులు రావద్దని అనుకుంది. వేల కోట్ల రూపాయల ఖర్చయినా ఫర్వాలేదు అని సీఎం కేసీఆర్ ధైర్యం చెప్పారు. తక్షణం నిధుల్ని మంజూరు చేస్తున్నాం అని చెప్పారు. వైద్య సిబ్బంది కొరతను అధిగమించడానికి మూడు వేల మంది డాక్టర్లు, నర్సులను తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్రం దగ్గర కోటి మాత్రలు ఉన్నాయి. 11 లక్షల ఎన్-95 మాస్కులు ఉన్నాయి. 10 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయి. ఇక సర్జికల్ గ్లౌజులు, సర్జికల్ మాస్కులు పుష్కలంగా ఉన్నాయి. ఎన్ని కేసులు వచ్చినా చికిత్స ఇవ్వడానికి తగినంత సంఖ్యలో బెడ్‌లు, ఐసొలేషన్ వార్డులు, ఐసీయూ వార్డులు ఉన్నాయి. వేటికీ కొరత లేదు.
ప్రజలకు, వైద్య సిబ్బందికి ఏం ధైర్యం కల్పించారు?
కష్టకాలంలో ప్రజలకు ఎలా దగ్గర ఉండాలో, ఎలా నాయకత్వం వహించాలో, ఎలా ఆదుకోవాలో కేసీఆర్ తన స్వీయానుభవంతో వివరించారు. ఆ ప్రకారంగా మంత్రిగా నేను కూడా మా వైద్య సిబ్బందికి ధైర్యం కల్పించా. ప్రజలకు ధైర్యం చెప్పా. మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తించగలిగా. ఒక స్టేజికి వచ్చిన తర్వాత ఆరోగ్యశాఖ కీలకంగా మారింది. సీఎం నాయకత్వంలో తెలంగాణ అధికార యంత్రాంగం ఒక్కటై పనిచేసింది. ఏక కాలంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయకుండా అవగాహన కల్పించి ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అదే సమయంలో వైద్యారోగ్య శాఖలోని డాక్టర్లు, పారా మెడికల్, నర్సింగ్ సిబ్బందికి మనోస్థయిర్యం కల్పించి పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందించేలా మానసికంగా సంసిద్ధం చేశాం.
లాక్‌డౌన్ నేర్పిన పాఠమేంటి?
వైరస్ వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ మంచి నిర్ణయం. అయితే దీర్ఘకాలం లాక్‌డౌన్ ఉంటే ప్రజలంతా ఇండ్లలో కూర్చుంటే పొట్ట నిండదు. ఇల్లు గడవదు. రెక్కాడితేగానీ డొక్కాడని లక్షలాది మంది గురించి ఆలోచించాల్సి వచ్చింది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన పరిశ్రమలను నడిపేవారు ఉన్నారు. వారి దగ్గర పనిచేసే కూలీలూ ఉన్నారు. వాటికి తాళం వేసుకుని కూర్చుంటే లక్షలాది మంది ఇబ్బంది పడతారు. కోట్ల మంది ప్రజల ఆర్తనాదాలు వినే పరిస్థితి వస్తుంది. వాటిని నడుపుకోకపోతే వచ్చే పరిణామం ఏంటో తెలుసు కాబట్టి తెరవాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదు. అందుకే ప్రభుత్వంలోని అన్ని విభాగాలు వేటి పని అవి చేయాల్సి వచ్చింది. ఆ దిశగా సీఎం కూడా అధికారులను సంసిద్ధం చేశారు. పాజిటివ్ వచ్చినవారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స చేసే బాధ్యతను వైద్యారోగ్య శాఖ తీసుకుంది. మిగిలిన విభాగాలూ వాటి పని అవి చేస్తున్నాయి. వైద్యపరంగా తెలంగాణ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉంది. పనిచేస్తూ ఉంది.
కరీంనగర్‌లో ఇండోనేషియా ఉదంతం తర్వాత ఏం చేశారు?
ఎవరైనా ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలితే అది ఆ వ్యక్తికి సంబంధించినది మాత్రమే. కానీ మిగిలిన రోగాల్లాగా దీన్ని ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం చేయలేదు. ఆ వ్యక్తితో సంబంధంలో ఉన్నవారి చైన్ మొత్తాన్ని చివరిదాకా శోధించాలి. ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పట్టుకోవడంలో పోలీస్, మున్సిపల్, జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య సిబ్బంది పడిన శ్రమను మాటల్లో వర్ణించలేం. 24 గంటలూ పనిచేశారు. కట్టడి చేసే ప్రయత్నాలను ఇప్పటికీ మనం చూస్తున్నాం. కరీంనగర్‌లో ఇండోనేషియా పౌరులకు పాజిటివ్ వస్తే దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నాం. కంటైన్‌మెంట్ విధానంతో వైరస్ వ్యాప్తి కాకుండా కట్టడి చేశాం. దేశానికే కంటైన్‌మెంట్ అనే విధానాన్ని పరిచయం చేశాం. అందుకే మొత్తం దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. అంత పకడ్బందీగా పనిచేశాం. ఇప్పుడూ అది కొనసాగుతూనే ఉంది.
మంత్రిగా మీ పనితీరు ఎలా ఉంది?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి టర్మ్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేశా. కొత్త రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేలా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేశా. ఐదేళ్ళ శ్రమ తర్వాత ఫలితం ఏంటో యావత్తు దేశమే గుర్తించింది. ఇప్పుడు ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టా. ఏడాదికల్లా కోవిడ్ ఉపద్రవం వచ్చిపడింది. ఇది కూడా సవాలు వంటిదే. సీఎం స్వయంగా గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి శాయశక్తులా పనిచేస్తున్నా. టైమ్ టేబుల్‌తో సంబంధం లేకుండా పని చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ 24 గంటలు పనిచేస్తున్నాయి. ఎప్పుడైనా ఒక్క మంత్రిత్వశాఖ మాత్రమే విడిగా పనిచేయదు. మొత్తం మంత్రివర్గం పనిచేస్తుంది. కరోనా విషయంలో ప్రభుత్వ పెద్దగా సీఎం కూడా ప్రతీరోజు గంటల తరబడి వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు. అనుక్షణం ఫోకస్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విషయంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఆ శ్రమ ఫలితమే ఇతర రాష్ట్రాల కన్నా మనం మెరుగ్గా ఉండగలగడం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎవరి స్థాయిలో వారు పనిచేశారు. కింది నుంచి పై దాకా ప్రతీ ఒక్కరూ సమిష్టిగా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలేంటి?
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రతీ రోజు సీఎం సమీక్ష చేస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు నాతో రివ్యూ చేసేవారు. జనరల్‌గా ఇలాంటి క్రైసిస్‌లో పనిచేయడం, ఫలితం సాధించడం చాలా ముఖ్యం. ప్రజలు కూడా దాన్నే గమనిస్తుంటారు. అందుకే కేసుల విషయంలో మిగిలిన రాష్ట్రాలు, నగరాలతో పోలిస్తే మనం చాలా మెరుగ్గా ఉన్నాం. మరణాల రేటును తగ్గించగలిగాం. ప్రజల్లో కాన్ఫిడెన్స్‌ను పెంచగలిగాం. లేకుంటే హైదరాబాద్ నగరం కూడా అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నయ్ లాంటి నగరాల్లాగా తయారయ్యేది. కానీ ఆ పరిస్థితి మనకు లేదు. హైదరాబాద్‌లో కోటి జనాభా ఉంది. వందల, వేల, మురికివాడలు, బస్తీలు ఉన్నాయి. లక్షలాది మంది బతుకుతున్నారు. అందరూ పేదలే. మన ప్రభుత్వ పాజిటివ్ నిర్ణయాల వల్ల, ఎఫెక్టివ్ పని విధానం వల్ల మిగిలిన ప్రధాన నగరాలకంటే మనం బెటర్‌గా ఉన్నాం.
మీ దినచర్య ఎలా ఉంటుంది?
కరోనా వచ్చిన తర్వాత బాగా బిజీగా గడపాల్సి వచ్చింది. ఉదయం ఆరు గంటలకు కార్యాచరణ మొదలవుతుంది. అది రాత్రి రెండు గంటల దాకా కొనసాగుతుంది. నిరంతరం రివ్యూ, ఫీల్డ్ విజిట్, సమాచార సేకరణ, అధికారులతో మీటింగులు, వర్క్ ప్లాన్, బాధ్యతలు అప్పజెప్పడం, అవసరమైన సూచనలు చేయడం, నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. ఇలా చాలా పనులు ఉంటాయి. రాజకీయ నాయకుడిగా నియోజకవర్గ ప్రజలను కలవడం, వారి సమస్యలకు పరిష్కారం చూపడం కూడా అవసరం. ఏకకాలంలో మల్టీ టాస్క్‌లు నిర్వహించడం అందరికీ ఉన్నట్లుగానే నాకూ తప్పలేదు. నిజానికి కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో ఉండేది తక్కువ సమయమే. కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా కొన్నిసార్లు వీలు చిక్కడంలేదు. ప్రజల్లో కరోనా భయాలను తగ్గించడం, పాజిటివ్ పేషెంట్లను మళ్ళీ కుటుంబాలకు చేర్చడమే అన్నింటికన్నా పెద్ద బాధ్యత.
ఆంక్షలతో కట్టడి… సడలింపులతో జీవితం.. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
లాక్‌డౌన్‌లో ప్రజలను ఇళ్ళకే పరిమితం చేయడం అవసరం. అందుకే కొంతకాలం పకడ్బందీగా అమలు చేశాం. ఆ సమయంలో పేదల కడుపు నింపాం. లాక్‌డౌన్‌ను ఎప్పటికీ కొనసాగిస్తూ ఎకానమీని ఖరాబ్ చేసుకోలేం. ఫలితంగా కోట్లాది మందిని రోడ్డున పడేయలేం. ఆకలి చావులతో వేలాది మంది చనిపోవడాన్ని చూడలేం. కరోనా కారణంగా చనిపోయేది పరిమిత సంఖ్యలోనే. ప్రపంచం, దేశం ఏం చేస్తున్నాయో మనమూ అదే చేస్తున్నాం. మనం ప్రత్యేక దేశంగా లేం. సొంత నిర్ణయాలు తీసుకోలేం. దేశం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనం కూడా చర్యలు తీసుకుంటున్నాం.
వైరస్ వ్యాప్తికి సడలింపులు కారణం కాదా?
సడలింపులతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందనేది వాస్తవం. భారత ప్రభుత్వం కూడా ప్రజలపై అక్కరతోనే ఏ నిర్ణయాలైనా తీసుకుంటుంది. వలస కార్మికుల రూపంలో ఇటీవల మానవ వేదనను అనుభవించింది దేశం. కోట్లాది మంది ఉపాధి లేక, చేతిలో డబ్బుల్లేక, తిండికి నోచుకోక ఆకలి చావులు చచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని కొనసాగించడం సాధ్యం కాదని అర్థమైపోయింది. ఇంత చేసినా మన దేశంలో కరోనా కారణంగా జరిగిన మరణాలు ఆరు వేలు. ఈ మూడు నెలల కాలంలో అనేక దేశాల్లో ఎంత మంది చనిపోతున్నారో చూస్తున్నాం. లాక్‌డౌన్‌ను కొనసాగిస్తే ప్రజలు ఎలా మరణిస్తారో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. కాబట్టి దాన్ని నివారించుకోవడం కోసం మళ్ళీ పని చేయడం మినహా మరో మార్గం లేదు. అందుకే ఆంక్షలను సడలించక తప్పలేదు.
రాబోయే కాలంలో పెరిగే కేసులకు ఎలా సన్నద్ధమవుతున్నారు?
రాబోయే సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలో ఇప్పటికే సమీక్షించాం. నిపుణులతో చర్చించాం. వారి అంచనాలు, సూచనలు మా దగ్గర ఉన్నాయి. కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో స్పష్టత ఉంది. వారికి చికిత్స అందించడంలో ఎదురయ్యే సమస్యలు, అధిగమించే మార్గాలూ ఉన్నాయి. అయితే మన దగ్గర అదృష్టం ఏమంటే.. పాజిటివ్ కేసుల్లో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ లేవు. 20 శాతం మందిలో మాత్రమే లక్షణాలు ఉన్నాయి. మొత్తం పాజిటివ్ పేషెంట్లలో 5% మంది మాత్రమే సీరియస్ ప్రభావానికి గురయ్యారు. మొత్తంమీద చూస్తే 2% మంది చనిపోతారని అంచనా. వీరిని కూడా బతికించడమే మా లక్ష్యం. అందుకే ఇంత తపన. మిగిలిన నగరాలతో పోలిస్తే పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ సక్సెస్ అవుతున్నాం. పాజిటివ్, ఎఫెక్టివ్ నిర్ణయాలే ఇందుకు కారణం. ఆసుపత్రుల్లో చేర్చడం మొదలు మళ్ళీ డిశ్చార్జి చేసి ఇంటికి పంపేవరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. అందుకే ఆ నగరాలతో పోలిస్తే మనం చాలా బెటర్. ఆ నగరాల్లో ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం.
విమర్శలు వచ్చినప్పుడు వాటిని ఎలా స్వీకరిస్తున్నారు?
కరోనా తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు. మొత్తం ప్రపంచానికే విస్తరించింది. వైరస్‌తో యుద్దం చేస్తున్నాం. ఇందులో 99 మంచి పనులు చేసినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఒక్క తప్పు జరిగితే అదే హైలైట్ అవుతుంది. మొత్తం దేశమే కరోనా మీద యుద్ధం చేస్తోంది. అన్ని రాష్ట్రాలూ ఇదే పనిలో ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాల్లో ఫలితాలు, మన రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తే మనం ఎక్కడున్నామో, ఎంత మెరుగ్గా ఉన్నామో తెలుస్తుంది. 24 గంటలూ ప్రజల ప్రాణాలను నిలబెట్టడం కోసం ప్రభుత్వం, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ తప్పుల్నే ఎత్తి చూపడం ద్వారా వైద్య సిబ్బంది డీమోరల్ అవుతారు. ఇటు సాధారణ మీడియా, అటు సోషల్ మీడియా పదేపదే భూతద్దంలో పెట్టి చూపించడం దురదృష్టకరం. ఇంత పెద్ద యుద్ధంలో అక్కడక్కడా లోపాలు ఉంటాయి. 99 మంచి పనులకు గుర్తింపూ ఉండదు. ప్రశంసలు అసలే ఉండవు. మంచి చేసినప్పుడు అభినందించే సంస్కారం ఉంటే లోపం జరిగినదాన్ని ఎత్తిచూపడానికి అర్హత ఉంటుంది. కానీ అలాంటివారికి ఆ సంస్కారం లేకపోవడం బాధ అనిపిస్తుంది. వారి గురించి మాట్లాడడం వృథా.