కబ్జా కోరల్లో పెద్ద చెరువు.. రియల్ దందా పేరుతో మింగేస్తున్న వైనం

by Sumithra |   ( Updated:2025-04-23 09:35:48.0  )
కబ్జా కోరల్లో పెద్ద చెరువు.. రియల్ దందా పేరుతో మింగేస్తున్న వైనం
X

దిశ, నల్లగొండ బ్యూరో : ఆ చెరువు చుట్టూ 10 గ్రామాలకు సంబంధించిన వేలాది ఎకరాల సాగు భూములకు నీరందించడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతున్న చెరువు నేడు కబ్జా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతుంది. అయినా రియల్ దందా వ్యాపారుల వలలో చిక్కుకున్న ఆ చెరువును కాపాడేందుకు అధికారులు కనీసం స్పందించకపోవడం ఆ ప్రాంత ప్రజలను ఆవేదన గురిచేస్తుంది. అంతే కాకుండా పాలకులకు తెలిసినప్పటికీ చెరువు ఆక్రమణకు గురి కాకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన ప్రజాప్రతినిధులు సైతం కళ్ళుండి చూడలేని గుడ్డివాలుగా ఉండిపోవడం అక్కడి ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. అది ఎక్కడా... ఏంటి అనుకుంటున్నారా.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఉన్న చెరువు పరిస్థితి.


పెద్ద చెరువు 96.11 ఎకరాలు..

మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో 456, 457 సర్వే నెంబర్లలో దాదాపు 96.11 వైశాల్యంలో పెద్ద చెరువు ఉంది. ఈ మొత్తం చెరువులో సుమారు 12 ఎకరాలకు పైగా బఫర్ జోన్ గా గుర్తించారు. అంతే కాకుండా సుమారు ఇద్దరు, ముగ్గురు రైతులకు కేవలం 5 ఎకరాల వరకు పేద రైతులకు "ఏక్ సాల్" పట్టాలు కలిగి ఉన్నారు. ఇల్లు కేవలం సాగు చేసుకోవడానికి తప్ప క్రయవిక్రయాలకు హక్కు లేదు. అది కూడా దాదాపు ఒక సీజన్లో మాత్రమే పంటలు పండే అవకాశం ఉంది.

చెరువులో 10 ఎకరాలు కబ్జా..

మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఉన్న పెద్ద చెరువులో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుమారు 10 ఎకరాల భూమిని కబ్జా చేసి రియల్ దందా చేస్తున్నారని సమాచారం. అక్కడ ఒక్క ఎకరం భూమి సుమారు రూ.2 కోట్లు విలువ కలిగి ఉంటుందని వినికిడి. అంటే మొత్తం పది ఎకరాల భూమి విలువ దాదాపు రూ .20 కోట్లు ఉంటుందని సమాచారం. చెరువు భూమి రియల్ దందా వ్యాపారుల చేతుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న విషయాన్ని గ్రామస్తులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన కనీసం స్పందించక పోవడమే గాకుండా, దాన్ని కాపాడేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


స్మైల్ పేరుతో వెంచర్ ఏర్పాటు..?

పెద్ద చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పది ఎకరాల భూమిని కబ్జా చేసి రియల్ దందా చేసి ఇళ్ల పాట్లు ఏర్పాటు చేశారు. అందులో 150, 200, 250 గజాల పేరుతో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఒక గజం భూమి విలువ రూ.10 నుంచి 15వేల వరకు అమ్ముకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. రియల్ వ్యాపారులు చెరువు భూమి ఆక్రమించడంతో అందులోకి వెళ్లాల్సిన వరద నీరంతా రోడ్డు పైకి రావడం ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. అంతకు ముందు ప్రభుత్వం వరద నీరు సాఫీగా వెళ్లిపోవడం కోసం కాలువలు నిర్మించింది. కానీ రియల్ ఎస్టేట్ దారులు ఆ కాలువలను మూసేయడంతో అనాజిపురం వెళ్ళే దారిలో ఇందిరా నగర్ కాలనీ పూర్తిగా జలమయం అయింది. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చిన నిరసన దృష్టిలో పెట్టుకొని వరద నీరు వెళ్లిపోవడానికి ఓ చిన్న కాల్వను రియల్ వ్యాపారులు ఏర్పాటు చేశారు. ఆ కాలువ నిర్మాణం కొంత ఉపశమనే తప్ప శాశ్వత పరిష్కారం కాదన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద చెరువు కాపాడాలని పట్టణ ప్రజలు కమిటీగా ఏర్పడి ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.

కొలతలు సరే.. హద్దు లేవి....??

ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలు పెంచిన పెద్ద చెరువు పూర్తిగా ఆక్రమణకు గురవుతుందన్న ఉద్దేశంతో చెరువు పరిరక్షణ కమిటీ పేరుతో జిల్లా కలెక్టర్ సమర్పించారు. దానికి స్పందించిన అధికారులు చెరువును పూర్తిస్థాయిలో సర్వే చేశారు. సర్వేచేసిన అనంతరం ఇచ్చిన నివేదికలో ఆ భూమి సర్వే నెంబర్లు, చెరువు విస్తీర్ణం, హద్దులు లాంటివి ఆ నివేదికలో పొందుపర్చలేదు. సర్వే చేసిందే కబ్జా భూమికి పరిష్కారం చూపించడం కోసం అని.. ఆ ప్రయత్నం ఏది అని నివేదికలో జరిగినట్టు కనిపించట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

పెద్ద చెరువును కాపాడాలి.. ఎడ్ల నరేష్, చైర్మన్, చెరువు పరిరక్షణ సమితి , మోత్కూరు.

పెద్ద చెరువు పూర్తిగా కబ్జా అవుతుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులు అందరి చేతుల్లో ఉంది. అధికారులు సర్వే చేసి కూడా హద్దులు తేల్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని దాన్ని కాపాడాలంటున్నారు.

కాసులు కక్కుర్తి పడి అనుమతి ఇచ్చారు.. పోచం సోమయ్య, బిజెపి పట్టణ అధ్యక్షులు, మోత్కూరు

కాసులకు కక్కుర్తి పడి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్మైల్ వెంచర్కు తాత్కాలిక అనుమతులు ఇచ్చారు.. భూమిలో నిర్మాణం అవుతున్న వెంచర్కు అనుమతులు ఇవ్వద్దని పదేపదే మొత్తుకున్న అధికారులు పట్టించుకోలేదు.. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి వెంచర్ భూమిని ఇరిగేషన్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవాలి.

సర్వే రిపోర్టును పరిశీలించి చర్య తీసుకుంటాం.. ఎన్.ఉపేందర్, తహాశీల్దార్ మోత్కూరు..

మోత్కూరు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధి నిర్ణయించేందుకు అధికారులు ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తాం. ఆ తర్వాత చెరువును కాపాడేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఈ మధ్యనే తాను ఇక్కడ అధికారిగా బాధ్యతలు స్వీకరించాను.. ఆ నివేదికను పూర్తిస్థాయిలో అవగతం చేసుకున్న తర్వాతనే తీసుకుంటా.



Next Story