- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డ్యూటీ మధ్యలో మధుర జ్ఞాపకం

దిశ, మిరుదొడ్డి : స్నేహానికన్నా మిన్న.. లోకాన లేదు రా.. అని స్నేహితులను ఉద్దేశించి పాడిన పాట మనమందరం వినే వున్నాం. సుధీర్ఘ కాలం తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే వారి ఆనందానికి అవధులు లేవు. అది కూడా ఇద్దరు ఉన్నత హోదాలో.. వివరాల్లోకి వెళితే శాంతి భద్రతల సమీక్ష కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట ఏసీపీ మధు ఖాజీపూర్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అందరి మనసులను తాకింది. 42 సంవత్సరాల విరామానంతరం, తన చిన్ననాటి మిత్రుడిని అకస్మాత్తుగా కలుసుకున్న అనుభూతి ఆయనకు చిరస్మరణీయంగా మిగిలింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కలిసి విద్యనభ్యసించిన కూరపాటి జగన్మోహన్ రాజు, మధు ఇద్దరు మంచి స్నేహితులు. కాలేజీ అనంతరం మధు హైదరాబాదులో ఉన్నత విద్యను కొనసాగిస్తూ పోలీస్ శాఖలోకి ప్రవేశించగా, జగన్మోహన్ రాజు ఖమ్మంలో విద్యను కొనసాగించి, ప్రధానోపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఒకే జిల్లాలో జగన్మోహన్ రాజు జడ్పీహెచ్‌ఎస్ ఖాజీపూర్‌లో ప్రధానోపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. డ్యూటీ సందర్భంలో పాఠశాల సందర్శనకు వచ్చిన ఏసీపీ మధు తన మిత్రుడిని చూడగానే కళ్లు మెరిశాయి. పరస్పరం ఆలింగనం చేసుకుని గత జ్ఞాపకాలను తెరపైకి తెచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఇద్దరూ తమ సిబ్బందికి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ, విద్యార్థి దశలోని సంఘటనలు, జ్ఞాపకాలు పంచుకున్నారు. ఈ మధుర క్షణం కేవలం వారి ఇద్దరికే కాదు, పాఠశాల సిబ్బంది, స్థానికుల మదిలోనూ ఓ అందమైన అనుభూతిగా నిలిచింది.