ఎనిమల్ ప్లేన్.. ఎగరడానికి రెడీ

by Shyam |
ఎనిమల్ ప్లేన్.. ఎగరడానికి రెడీ
X

లాక్‌డౌన్ కారణంగా చాలా మంది చాలా చోట్ల ఇరుక్కుపోయారు. వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను పెట్టింది. రైళ్లలో వెళ్లిపోగా మిగిలిన వారిని సోనూ సూద్ లాంటి ఆదర్శప్రాయులు ఇళ్లకు పంపిస్తున్నారు. కొద్దిగా డబ్బున్న వారు విమానాల్లో వచ్చేస్తున్నారు. ఇంకొద్దిగా ఎక్కువ డబ్బున్నవాళ్లు సొంతంగా విమానాలు అద్దెకు తీసుకుని వారి ఇళ్లకు చేరుకుంటున్నారు. మరి వేరే నగరాల్లో చిక్కుకుపోయిన పెంపుడు జంతువుల పరిస్థితి ఏంటి? వాటికి సొంత ఊరు, పరాయి ఊరు అని ఏముంటుంది… గింత అన్నం పడేస్తే ఎక్కడైనా ఉంటాయి అంటారా? అది తప్పు… ఈ మాట వాటి యజమానుల దగ్గర అంటే అక్కడే తిట్టేస్తారు. అవును.. ప్రేమగా చూసుకున్న పెంపుడు జంతువులు దూరంగా ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అలాగని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాటిని కూడా తోడుగా తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వాటి గురించి ఆలోచించిన 25 ఏళ్ల సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు దీపికా సింగ్‌కి ఒక ఆలోచన తట్టింది. ప్రత్యేకంగా పెంపుడు జంతువులకు ఒక ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాలన్న ఆమె ఆలోచన జూన్ రెండో వారంలో కార్యరూపం దాల్చబోతోంది.

విమానాల్లో పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణించడానికి చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాను ఇలా ప్రత్యేక జెట్ ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు దీపికా చెబుతున్నారు. ఈ విషయమై ప్రైవేట్ జెట్ సదుపాయాన్ని అందించే అక్రెషన్ ఏవియేషన్ సంస్థను ఆమె సంప్రదించారు. ఒక్కో సీటుకి రూ. 1.60 లక్షల చొప్పున మొత్తం జెట్‌కి రూ. 9.06 లక్షల అవుతుందని వారు చెప్పారు. ఆమె అందుకు అంగీకరించి ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన పెంపుడు జంతువుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో 58 ఏళ్ల హర్విందర్ కౌర్ తన రెండు పెంపుడు జంతువులను విమానం ద్వారా ఇంటికి రప్పించడానికి అంగీకరించారు. అలాగే మరో రెండు కుక్కలు కూడా ఈ విమానంలో ప్రయాణించనున్నాయి. ఢిల్లీ నుంచి ముంబైకి ఆరు పెంపుడు జంతువులతో ఒక ప్రైవేట్ జెట్ బయల్దేరబోతోంది. ఇప్పటికి ఇందులో నాలుగు సీట్లు నిండినందున, రెండు పెంపుడు జంతువుల కోసం దీపికా సింగ్ వెతుకుతున్నారు. ఈ విమాన ప్రయాణానికి మంచి స్పందన వస్తే తాను మరికొన్ని పెంపుడు జంతువులను స్వస్థలాలకు చేర్చేందుకు సహకరిస్తానని దీపికా అంటున్నారు.

Advertisement

Next Story