ఆస్తుల జప్తుపై నీరవ్ మోదీకి నోటీసులు జారీ చేసిన ప్రత్యేక కోర్టు!

by Shamantha N |
Nirav Modi
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలపై భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మహారాష్ట్ర ప్రత్యేక కోర్టు పబ్లిక్ నోటీసులను జారీ చేసింది. తన ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని, దీనికి సంబంధించి జూన్ 11న కోర్టులో స్పెషల్ జడ్జి వీ సీ బార్డె ముందు హాజరు కావాలని ఆదేశించింది. గడువు సమయానికి హాజరు కాకపోతే తనపై ఎఫ్ఈఓ(పరారీలో ఉండే ఆర్థిక నేరస్థుల) చట్టం కింద చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఈ చట్టం ద్వారా నీరవ్ మోదీ ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదని హెచ్చరించింది.

ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు 2019, డిసెంబర్‌లోనే నీరవ్ మోదీని పారిపోయిన ఆర్థిక నేరస్థుడి(ఎఫ్ఈఓ)గా ప్రకటించింది. అప్పటికే నేరవ్ మోదీ లండన్‌కు పారిపోవడంతో అప్పటినుంచి భారత్ అతన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే అక్కడి కోర్టు తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో నీరవ్ మోదీని ఇప్పుడిప్పుడే తీసుకురావడం ఆలస్యమవుతుందని తెలుస్తోంది. కాగా, ఈ కేసుకు సంబంధించి నీరవ్ మోదీ భార్య ఆమి, సోదరి పూర్వి, మరిది మయాంక్ మెహతాలకు కూడా ఇలాంటి నోటీసులనే కోర్టు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed