ఎంపీలంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలి : స్పీకర్

by Shamantha N |   ( Updated:2020-08-28 09:31:57.0  )
ఎంపీలంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలి : స్పీకర్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ ఓ బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులందరికీ కీలక సూచనలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న క్రమంలో పార్లమెంట్ సభ్యులంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం లేకుండా పార్లమెంట్‌లో సీటింగ్ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా సభ్యులందరికీ ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఓం బిర్లా తెలిపారు.

దీని వల్ల ఒకటి, రెండు రోజుల్లోనే రిపోర్టు తెలుస్తుందన్నారు. పార్లమెంట్ సిబ్బంది, అధికారులతోపాటు సమావేశాలను కవర్ చేసే జర్నలిస్టులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, డీఆర్డీవో, ఎయిమ్స్, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారని ఓం బిర్లా తెలిపారు. కాగా సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు లోక్‌సభ, అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. ఈ మేరకు ఉమ్మడి సమావేశ హాల్‌లో ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed