దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు

by srinivas |
దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు
X

దిశ ఏపీ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌ సమయంలో చిత్తూరు జిల్లా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కోటి లీటర్లకు పైగా పాలను దక్షిణ మధ్య రైల్వే ఎగుమతి చేసింది. దేశంలోని పాడి పరిశ్రమలో చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమది తిరుగులేని స్థానం. దీంతో లాక్‌డౌన్ ఆంక్షల అమలుతో రాజధానిలో పాల కొరత తీర్చేందుకు వారానికి ఒకసారి చిత్తూరు జిల్లా నుంచి పాలను ఢిల్లీకి ప్రత్యేక గూడ్సు రైలు ఎగుమతి చేస్తుండేది. జిల్లాలో పాల దిగుబడి నిత్యం 30 లక్షల లీటర్లు కావడానికి తోడు, ఢిల్లీ పాల అవసరాలు తీరుస్తుండడంతో తాజాగా రెండు రోజులకు ఒకసారి ప్రత్యేక గూడ్సు రైలు పాలను ఎగుమతి చేస్తోంది.

గతంలో రేణిగుంట నుంచి ఢిల్లీకి వెళ్లే ప్యాసింజర్‌ రైలుకు ఆరు ట్యాంకర్లను జోడించి పాలను ఢిల్లీకి పంపేవారు. లాక్‌డౌన్‌ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన వేళ రైతుల వద్ద పాల నిల్వలు పెరిగిపోయాయి. దీంతో డెయిరీలు పాలసేకరణ నిలిపేయడంతో పాటు ధరను కూడా తగ్గించాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే చొరవ తీసుకొని ‘దూద్‌ దురంతో స్పెషల్‌’ పేరిట రేణిగుంట-ఢిల్లీ-నిజాముద్దీన్‌ మధ్య పాల సరఫరా కోసం ప్రత్యేక గూడ్స్‌ రైలును నడిపింది.

మార్చి 22 న జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్ అమలులోకి రాగా, మార్చి 26 నుంచి ఇప్పటి వరకు 42 ట్రిప్పుల ద్వారా 1.04 కోట్ల లీటర్ల పాలను ఢిల్లీకి చేరవేసింది. గంటకు 110 కి.మీ వేగంతో నడిచే ఈ రైలు 36 గంటల్లో ఢిల్లీకి చేరుకుంటోంది. ఈ తరహా గూడ్స్‌ రైలు నడపడం దేశంలో ఇదే ప్రథమమని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed