దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా?

by Anukaran |
Captain Virat Kohli
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా ఇటీవల విదేశీ గడ్డపై విజయాలు సాధిస్తూ నెంబర్ 1 టెస్టు జట్టుగా ఎదిగింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను వారి సొంత గడ్డపైనే ఓడించి టీమ్ ఇండియా సత్తా చాటింది. ఆస్ట్రేలియా జట్టును గబ్బాలో ఓడించిన ఏకైక జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది. కానీ గత 29 ఏళ్లుగా భారత జట్టుకు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవడం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 1992 నుంచి ఇప్పటి వరకు 7 సార్లు టెస్ట్ సిరీస్‌ల కోసం పర్యటించింది. అందులో కేవలం ధోని నేతృత్వంలో ఒక సారి మాత్రం డ్రా చేసుకున్నది. మిగిలిన ఆరు సార్లు సిరీస్ ఓడిపోయింది. ఈ సారి సిరీస్ గెలవడం భారత జట్టుకే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా చాలా కీలకంగా మారింది. గత వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది విదేశీ గడ్డపై సాధించిన విజయాలే. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలో భారత జట్టు అద్భుతంగా సిరీస్‌లు గెలిచింది. ఆ సీజన్‌లో కేవలం న్యూజీలాండ్ మీదనే టెస్టు సిరీస్ కోల్పోయింది. ఇక ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే ఇంగ్లాండ్‌లో సిరీస్‌ను దాదాపు గెలిచింది. అర్దాంతరంగా నిలిచిపోయిన సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నది. మరో టెస్టు గెలిచినా.. డ్రా చేసినా చరిత్ర సృష్టిస్తుంది. కానీ ఈ లోగా దక్షిణాఫ్రికాలో అందని ద్రాక్షగా మిగిలిన టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉన్నది.

ఇదీ గత చరిత్ర..

భారత జట్టు తొలి సారిగా 1992లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. దక్షిణాప్రికాపై ఐసీసీ నిషేధం ఎత్తివేసిన తర్వాత అక్కడ మన జట్టే పర్యటించింది. అజారుద్దీన్ కెప్టెన్సీలో వెళ్లిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1తో ఓడిపోయింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్‌లలో మాత్రం భారత జట్టు డ్రా చేసుకోగలిగింది. ఆ పర్యటనలోనే ప్రవీణ్ అమ్రే టెస్ట్ అరంగేట్రం చేసి తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. ఇక 1997లో సచిన్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా పర్యటించింది. తొలి టెస్టులో 328 పరుగులతో, రెండో టెస్టులో 282 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే మూడో టెస్టులో రాహుల్ ద్రవిడ్ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులతో అడ్డుగోడలా నిలిచాడు. దీంతో భారత జట్టు ఆ మ్యాచ్ డ్రా చేసుకుంది. కానీ సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2001లో దక్షిణాఫ్రికాలో పర్యటించింది. తొలి టెస్టులో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ అరంగేట్రం చేయడమే కాకుండా సెంచరీ బాదాడు. ఇక ఆ తర్వత వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వీరోచితంగా పోరాడటంతో భారత జట్టు మ్యాచ్ డ్రా చేసుకుంది. కానీ సిరీస్‌ను 0-1తో కోల్పోయింది. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్‌గా 2006-07లో భారత జట్టు మరోసారి దక్షిణాఫ్రికాలోపర్యటించింది. పేసర్ శ్రీశాంత్ చెలరేగి 8 వికెట్లు తీయడంతో తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. ఆఫ్రికా గడ్డపై భారత జట్టు సాధించిన తొలి టెస్టు విజయం ఇదే. కానీ మిగిలిన రెండు టెస్టుల్లో భారత జట్టు ఓడిపోయి సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.

ఓటమి లేకుండా కాపాడిన ధోని..

మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత జట్టు రెండు సార్లు అక్కడ పర్యటించింది. తొలి సారిగా 2010-11 సీజన్‌లో భారత జట్టు అక్కడ పర్యటించి 1-1తో సిరీస్ డ్రా చేసుకున్నది. తొలి సారిగా ఒక భారత జట్టు కెప్టెన్ దక్షిణాఫ్రికాలో ఓటమి లేకుండా తిరిగి వచ్చాడు. అయితే 2013-14లో మరోసారి ధోనీ సారథ్యంలో భారత జట్టు సఫారీ పర్యటన చేసింది. తొలి టెస్టు డ్రా చేసుకున్నది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 119, 96 పరగులు చేశాడు. అయితే రెండో టెస్టులో మాత్రం దక్షణాఫ్రికా విజయం సాధించి సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్నది. మూడేళ్ల క్రితం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు పర్యటించింది. అప్పుడు టీమ్ ఇండియా 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. కానీ ఆ పర్యటనలో కోహ్లీ 5 టెస్టుల్లో 55కి పైగా సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, ఒక అర్ద సెంచరీ కూడా ఉన్నది.

కోహ్లీకి కీలకం..

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్ ఇండియాలో కెప్టెన్సీ రగడ అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఈ టెస్టు సిరీస్ గెలవడం కోహ్లీకి తప్పనిసరి. గత రెండేళ్లుగా సెంచరీ లేకుండా టెస్టు క్రికెట్‌ను నెట్టుకొస్తున్నాడు. అదే సమయంలో సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, చతేశ్వర్ పుజారాలు ఫామ్‌లో లేరు. దీంతో కోహ్లీపై కెప్టెన్సీ భారమే కాకుండా బ్యాటింగ్ భారం కూడా పడనున్నది. ఇక రోహిత్ శర్మ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల గైర్హాజరులో విదేశీ గడ్డపై విజయం కోసం కష్టపడాల్సిందే. శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉండటం జట్టుకు తప్పకుండా కలిసి వస్తుంది. బుమ్రా, ఇషాంత్, సిరాజ్‌లు బౌన్సీ పిచ్‌లపై తప్పక రాణిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా దక్షిణాప్రికాలో ఆ జట్టును ఓడించడం సవాలుతో కూడుకున్నదే.

Advertisement

Next Story