ఎయిర్‌టెల్‌తో అమెజాన్ చర్చలు!

by Harish |
ఎయిర్‌టెల్‌తో అమెజాన్ చర్చలు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: టెలికాం దిగ్గజ కంపెనీ ఎయిర్‌టెల్‌లో 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15 వేల కోట్లు) విలువైన ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో పెరుగుతున్న డిజిటల్ వినియోగంపై అమెరికా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ అత్యధిక 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా పెరుగుతున్న డిజిటల్, ఓటీటీ వినియోగంతో పోటీ పడేందుకు ఎక్కువ వినియోగదారులను కలిగిన తమతో ఈ ఒప్పందం గురించి చర్చిస్తున్నారని, ఇతర వివరాలేమీ తమకూ తెలియవని ఎయిర్‌టెల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ సంస్థ రూ. 3.1 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. అమెజాన్ పెట్టుబడులు పెట్టే 2 బిలియన్ డాలర్లతో 5 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయగలదని తెలుస్తోంది.

కొంతకాలంగా ప్రధాన దేశీయ టెలికాం కంపెనీలు ఏజీఆర్ బకాయిల కారణంగా రుణాలను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు రిలయన్స్ జియోతో పోటీని తట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. జియో పోటీ కారణంగా ఆ రెండు కంపెనీల వినియోగదారులు భారీగా తగ్గిపోయారు. ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ కంపెనీ అయిన భారతీ టెలికాం కంపెనీ ఇటీవల తమ వాటాలో 2.75 శాతాన్ని రుణాలు చెల్లించడానికి విక్రయించింది. తాజాగా అమెజాన్ ఈక్విటీ వాటా కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్‌టెల్‌కు భారీగా రుణాలను తగ్గించుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌ 30 కోట్ల మంది వినియోగదారులతో మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్, అమెజాన్ మధ్య ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed