IPL 2021 ఆటగాళ్లు డుమ్మా.. ఇప్పుడెలా?

by Shyam |   ( Updated:2021-05-29 09:44:29.0  )
IPL 2021 ఆటగాళ్లు డుమ్మా.. ఇప్పుడెలా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021 (IPL 2021) లో మిగిలిన 31 మ్యాచ్‌లు సెప్టెంబర్ 3వ వారం నుంచి యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. క్రికెట్ ప్రేమికులందరికీ ఇది సంతోషకరమైన వార్తే. అయితే ఫ్రాంచైజీ యాజమాన్యాలను మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించడం అందరికీ ఆమోదయోగ్యమే అయినా.. విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండరనే వార్తనే కలవరపెడుతున్నది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తమ జాతీయ జట్ల తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. దీంతో కీలక ఆటగాళ్లు యూఏఈ వచ్చేది అనుమానంగా మారింది.

ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలలో ఫారిన్ ప్లేయర్లు కీలకంగా ఉన్నారు. వాళ్లు లేకపోతే కొన్ని జట్లు అనామకంగా మారిపోయే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికిప్పుడు స్వదేశీ ఆటగాళ్లను బదిలీ చేసుకునే అవకాశం కూడా లేదు. దీంతో విదేశీ ఆటగాళ్లే కీలకంగా ఉన్న ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి.

ఇంగ్లాండ్ ప్లేయర్లు కష్టమే..

ఇంగ్లాండ్ జట్టు సెప్టెంబర్ 18 లేదా 19వ తేదీన బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నది. ఆ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతామని ఇప్పటికే ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తెలిపారు. ఈసీబీ కాంట్రాక్టులో ఉన్న 12 మంది ఆటగాళ్లను ఐపీఎల్ కోసం విడుదల చేయబోమని ఆయన స్పష్టం చేశారు. దీంతో రాజస్థాన్‌లో (Rajasthan Royals) కీలకంగా ఉన్న జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, సీఎస్కే జట్టులోని సామ్ కర్రన్, మొయిన్ అలీ, కేకేఆర్ (KKR) జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గా, సన్‌రైజర్స్(SRH) జట్టులోని జానీ బెయిర్‌స్టో, జేసన్ రాయ్ అందుబాటులో ఉండరు. వీళ్లందరూ ఆయా ఫ్రాంచైజీల్లో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. వారి స్థానంలో ఇతర క్రికెటర్లను తీసుకున్నా వారిలా ప్రదర్శన చేస్తారా లేదా అనేది అనుమానమే.

ముఖ్యంగా ఈ ఏడాది బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ లివింగ్‌స్టన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు దూరం కావడంతో ఆ జట్టు ప్రదర్శన పేలవంగా మారింది. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో భారమంతా కెప్టెన్ సంజూ శాంసన్‌పైనే పడింది. దీంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో వెనుకబడింది. మరోవైపు కోల్‌కతా జట్టుకు ఈ ఏడాది పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్‌ను నియమించారు. అతడు అందుబాటులో లేకపోతే కొత్త కెప్టెన్‌ను వెతకాల్సి ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో జానీ బెయిర్‌స్టో లేకపోతే టాపార్డర్ బలహీనంగా మారడం ఖాయం. బెంచ్ మీద ఉన్న జేసన్ రాయ్ కూడా అందుబాటులో లేకపోతే హైదరాబాద్ జట్టు తమ పేలవ ప్రదర్శనే కొనసాగిస్తుందేమో అని యాజమాన్యం కూడా ఆందోళన చెందుతున్నది.

వాళ్లు కూడా డౌటే..

ఇంగ్లాండ్ జట్టు కనుక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తే షకీబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహ్మాన్ కూడా ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరు. దీంతో రాజస్థాన్, కోల్‌కతా జట్లకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ కారణంగా వెస్టిండీస్ ఆటగాళ్లు వస్తారో లేదో అని డౌట్ ఉన్నది. అంతే కాకుండా కరేబియన్ ప్రీమియల్ లీగ్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రిస్ గేల్, కిరాన్ పొలార్డ్, హెట్‌మేయర్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉండకపోవచ్చు. మరోవైపు ఆప్గనిస్తాన్ ఆటగాళ్లకు కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి.

ఒకటో రెండో క్రికెట్ బోర్డులను అయితే బీసీసీఐ సముదాయించేది.. కానీ ఇన్ని దేశాల క్రికెటర్లు బిజీగా ఉండటంతో ఏం చేయాలో బీసీసీఐకి కూడా అర్దం కాలేదు. అయితే విదేశీ ఆటగాళ్లు లేకపోయినా.. బెంచ్‌పై ఉన్న స్వదేశీ ఆటగాళ్లతోనే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ కూడా ఇంగ్లాండ్ ప్లేయర్ల గైర్హాజరి కారణంగా తమకు పెద్దగా నష్టం లేదన్నారు. తమ బెంచ్ బలంగా ఉన్నదని.. వారితోనే ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడతామని ఆయన అన్నారు. మిగిలిన ఫ్రాంచైజీలు కూడా విదేశీ ప్లేయర్ల కోసం చూడకుండా తమ స్వదేశీ బెంచ్‌ను పరీక్షించడానికి ఇది సరైన అవకాశం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed