ఏపీలో సోలార్ వాటర్ ఏటీఎంలు

by srinivas |   ( Updated:30 Sept 2021 7:04 AM  )
ఏపీలో సోలార్ వాటర్ ఏటీఎంలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సోలార్‌ వాటర్‌ ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్‌ అవసరం లేకుండా కేవలం సౌర శక్తిపై ఆధారపడి నాణ్యమైన నీటిని అందించే సోలార్ వాటర్ ఏటీఎంలు మరికొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఆర్వో ప్లాంట్ల కంటే స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా ఈ సోలార్‌ ఏటీఎంను రూపొందించారు. అయితే, రాష్ట్రంలో సోలార్ వాటర్ ఏటీఎంల ఏర్పాటుకు నెడ్ క్యాప్ ముందుకు వచ్చింది. సోలార్ ఏటీఎంల ఏర్పాటుకు సంబంధించి ఆసక్తికలిగిన వారు అక్టోబర్‌ 8లోపు బిడ్లు దాఖలు చేయాలని నెడ్ క్యాప్ ఆహ్వానించింది. అనంతరం 11న టెక్నికల్‌, ఫైనాన్షియల్‌ బిడ్లను తెరవనున్నట్లు నెడ్ క్యాప్ స్పష్టం చేసింది.

ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే!
ఒడిశాలోని కోణార్క్‌ స్మార్ట్‌ సిటీ సూర్య దేవాలయంలో సోలార్‌ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. అవి విజయవంతమవ్వడంతో మన రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టేందుకు నెడ్ క్యాప్ ముందుకు వచ్చింది. తొలుత స్మార్ట్‌ సిటీలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలు, ఆలయాలు, పార్కులు, బస్టాండ్లు, ఆస్పత్రుల్లో వాటర్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తోంది. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో అయితే మునిసిపల్‌ వాటర్‌ పైప్‌లైన్లను వీటికి కనెక్ట్‌ చేస్తారు. ఆ నీటిని స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేసి ప్యూరిఫై చేస్తారు.

ఫ్రీకాదు.. కొనాల్సిందే
సోలార్ వాటర్ ఏటీఎంల ద్వారా వచ్చే నీరు ఉచితం కాదని నెడ్ క్యాప్ స్పష్టం చేస్తోంది. డిజిటల్ బ్యాంకింగ్ విధానం ద్వారా అంటే గూగుల్‌/ఫోన్‌పే ద్వారా నగదు చెల్లించి నీటిని పొందవచ్చు. 250 ఎంఎల్‌, లీటర్, 10 లీటర్ల పరిమాణంలో నీటిని తీసుకునే వీలుంటుంది. సోలార్‌ ఏటీఎంలలో నార్మల్‌ వాటర్‌తో పాటు కూలింగ్‌ చేసే చిల్లర్‌లు కూడా ఉంటాయి. బటన్‌ నొక్కి ఏ నీరు కావాలనుకుంటే ఆ నీరు పొందవచ్చు. ఇవి గంటకు 500 లీటర్ల నీటినిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీటిలో ఫ్లోరైడ్‌ను తొలగించగలిగే పరిజ్ఞానం ఈ ఏటీఎంలలో ఉండటం మరో విశేషం. అంతేకాకుండా నీటిలో నాణ్యతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు డిస్‌ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed