జియోలో ఫేస్‌బుక్ ‘ఖాతా’

by Shyam |
జియోలో ఫేస్‌బుక్ ‘ఖాతా’
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలు చేయడానికి రెడీ అయిపోయింది. ఈ వాటా విలువ రూ. 43,574 కోట్లని రెండు సంస్థలు విడివిడి ప్రకటనలు విడుదల చేశాయి. ఈ కొనుగోలుతో జియో సంస్థలో అతిపెద్ద వాటాదారుగా ఫేస్‌బుక్ ఉండనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) సంస్థలో భాగంగా ఉన్న రిలయన్స్ జియో ఇండియాలో స్పీడ్‌గా విస్తరిస్తున్న టెలికాం నెట్‌వర్క్. 2016లో ఇండియా టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ తక్కువ కాలంలో విస్తరించింది. ఇప్పటివరకూ జియోకు 38.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

‘ఇండియాలో ఉన్న చిన్న తరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వాలనేది తమ లక్ష్యం. దేశంలోని ఆరుకోట్ల మంది చిన్న తరహా వ్యాపారులకు అండగా ఉండాలనుకుంటున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారికి ఏకం చేయాలనుకుంటున్నాం. కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడ్డాక భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటుంది, ఈ క్రమంలో జియో, ఫేస్‌బుక్ భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నాం’ రిలయన్స్ పేర్కొంది.

ఇండియాలో డిజిటల్ వ్యవస్థ స్పీడ్‌గా విస్తరిస్తున్న ఈ తరుణంలో జియోతో కలిసి ఇందులో భాగం అయ్యామని ఫేస్‌బుక్ తెలిపింది. ఈ భాగస్వామ్యం ఇండియాలో ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు తోడ్పడుతుందని ఫేస్‌బుక్ అభిప్రాయపడింది. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారలు ఇదివరకటి కంటే పటిష్టంగా పనిచేసే అవకాశాలు రూపొందించనున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకూ తమ అధీనంలో ఉన్న ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ఇండియా ప్రజలే ఎక్కువున్నారని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. భవిష్యత్తులో ప్రతిభ ఉన్న పారిశ్రామికవేత్తలకు ఇండియా నిలయంగా ఉండనున్నట్టు మార్క్ అభిప్రాయపడ్డారు. ఇండియాలో డిజిటల్ వ్యవస్థ పుంజుకోవడానికి జియో కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు.

ఇండియాలోని ఓ సంస్థలో ఫేస్‌బుక్ వాటాను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఫేస్‌బుక్‌‌ మీషో అనే ఈ-కామర్స్ సంస్థలో స్వల్ప వాటాను కలిగి ఉంది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అన్ అకాడమీలో మైనారిటీ వాటాను కలిగి ఉంది.

Tags: Facebook-Reliance Jio, Facebook And Reliance Deal, Jio, Platforms, Ambani, Mark Zuckerberg

Advertisement

Next Story

Most Viewed