ఇప్పటివరకు రూ. 1001.44 కోట్లు పట్టివేత

by Shamantha N |   ( Updated:2021-04-16 11:32:59.0  )
ఇప్పటివరకు రూ. 1001.44 కోట్లు పట్టివేత
X

న్యూఢిల్లీ: ఎన్నికలంటే ప్రచారాలు, ప్రలోబాలు, డబ్బు, మద్యం పంపకాలు, తాయిలాలు, ఆకాశాన్నందించే హామీలుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించడానికి డబ్బు, బహుమానాలు, మద్యం ఏరులైపారడం సర్వసాధారణమైపోయింది. ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తున్నా గుట్టుగా జరగాల్సిన పనులు చకచకా జరిగిపోతుంటాయి. అనుకోకుండా పదో పరకో వార్తాపత్రికల్లో వెలుగులోకి వస్తుంటాయి. ఈసీ అధికారులు పట్టుకుంటుంటారు. అలా ఈసీ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గురువారం నాటికి పట్టుకున్న మొత్తం రూ. 1001.44 కోట్లు అని వెల్లడించింది.

ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పశ్చిమ బెంగాల్‌లో ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో గురువారం నాటికి మొత్తం 1001.44 కోట్ల విలువైన నగదు, లిక్కర్, బహుమానాలు, ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. ఇందులో నగదు రూపంలో పంపిణీనే అత్యధికంగా ఉన్నది. రూ. 344.85కోట్ల నగదును సీజ్ చేసినట్టు వివరించింది. అన్ని రూపాల్లోనూ కలుపుకుని తమిళనాడులో అత్యధికంగా రూ. 446.28 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది.

తర్వాతి స్థానంలో రూ. 300.11 కోట్లతో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో ఉన్నది. ఈ రాష్ట్రంలో కేవలం నాలుగు విడతల పోలింగ్ మాత్రమే ముగిసింది. ఇంకా నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉన్న విషయం విదితమే. ఇదిలా ఉండగా, ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తాలు గత ఎన్నికలతో పోల్చితే నాలుగు రెట్లకు మించి ఉండటం ఆందోళనకరం. 2016లో ఈ ఎన్నికల్లో ఈసీ 225.77 కోట్ల మొత్తాలను సీజ్ చేసింది. అంటే ఎన్నికల్ల ధనప్రవాహం ఏ స్థాయిలో పెరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు. ఈసీ కంటికి కనిపించిన మొత్తాలు ఇంతుంటే.. ఇక కనిపించకుండా గుట్టుగా పంపిణీ అయిన మొత్తం ఇంకా ఎక్కువే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

Advertisement

Next Story