పాములంటే ఆసక్తా?

by  |
పాములంటే ఆసక్తా?
X

దిశ, వెబ్‌డెస్క్:

పాములు విషపూరితం కాకపోయి ఉంటే వాటిని చాలా మంది పెంపుడు జంతువులుగా పెంచుకునేవారు. ఇప్పటికీ కొందరు పెంచుకుంటున్నారనుకోండి.. కానీ అందరికీ అంత ధైర్యం ఉండదు కదా! ధైర్యం ఉండకపోవచ్చు కానీ వాటిని ప్రత్యక్షంగా కాకుండా వీడియోల్లో చూడటం, వాటి గురించి ఆకట్టుకునే విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారు యూట్యూబ్‌లో ‘స్నేక్ వీడియోస్’ అని సెర్చ్ చేస్తారు. కానీ వారు కోరుకున్న సమాచారం దొరకకపోగా, గ్రాఫిక్ చేసిన వీడియోలు, తప్పుడు వీడియోలు ఉంటాయి. దీంతో అసంతృప్తి చెందుతారు. కానీ పాముల గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక మంచి యూట్యూబ్ చానల్ ఉంది. అదేంటో తెలుసా? స్నేక్ డిస్కవరీ.

పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏయే పాము ఎలా ప్రవర్తిస్తుంది? ఇంకా వాటి గురించిన ఎన్నో ఆసక్తికర సమాచారంతో పాటు పాములు గుడ్ల నుంచి బయటికి రావడం, రెండు వేర్వేరు జాతికి చెందిన పాముల మధ్య సంకరం చేస్తే ఎలాంటి జాతులు పుడతాయి, ఒకే గుడ్డు నుంచి రెండు తలలతో పాములు పుట్టడం ఇలాంటి వీడియోలన్నీ ఈ స్నేక్ డిస్కవరీ యూట్యూబ్‌ చానల్‌లో ఉంటాయి. దీన్ని ఎమిలీ, ఎడ్ రాబర్ట్స్ అనే ఇద్దరు దంపతులు నడుపుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన ఎమిలీకి ఫిషరీస్, వైల్డ్‌లైఫ్‌లో డిగ్రీ పట్టా ఉంది. తర్వాత ఎగ్జోటిక్ యానిమల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాచురల్ రిసోర్సెస్‌లో పనిచేసిన అనుభవంతో ఆమె పాఠశాలలు, లైబ్రరీలు, ఈవెంట్‌లకు వెళ్లి పాముల గురించి అనేక విషయాలు చెబుతూ ప్రదర్శనలు ఇచ్చేది. అదే అలవాటుగా 2015లో సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించి పాముల గురించి, ఇతర సరీసృపాల గురించి భర్త ఎడ్‌తో కలిసి చాలా విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. ప్రస్తుతం వారి చానల్‌కు 1.97 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.


Next Story

Most Viewed