పాము కాటుకు బలైన స్నేక్ క్యాచర్

by srinivas |   ( Updated:2021-07-03 10:14:08.0  )
పాము కాటుకు బలైన స్నేక్ క్యాచర్
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మాలపల్లెలో విషాదం చోటు చేసుకుంది. మాలపల్లెకు చెందిన రంగస్వామి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. అంతేకాదు పాములు పట్టుకోవడం కూడా తెలుసు. దీంతో గ్రామంలో ఎక్కడ పాములు కనిపించినా గ్రామస్థులు రంగస్వామికి చెప్తారు. ఎలాంటి పరికరం అవసరం లేకుండా సునాయాసంగా పామును పట్టుకొని అటవీప్రాంతంలో విడిచేవాడు. పెద్ద పెద్ద సర్పాలను సైతం ఎలాంటి బెరుకు లేకుండా ఒంటి చేత్తో చాకచక్యంగా పట్టుకొనే వాడు. దీంతో ఆ ఊరిలో పెద్ద స్నేక్ క్యాచర్ ఎవరంటే రంగస్వామి పేరే వినిపించేది. అయితే శుక్రవారం నాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద విషసర్పం ఒకటి ప్రత్యక్షమైంది.

దీంతో అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులు రంగస్వామికి సమాచారాన్ని అందించారు. రంగస్వామి పామును పెట్టే ప్రయత్నం చేయగా అది దొరక్కపోవడంతో చంపే ప్రయత్నం చేశాడు. కర్రతో పాము తలపై బలంగా రెండు సార్లు మోదాడు. దీంతో ఆ పాము చలనం లేకుండా పడిపోవడంతో చేతితో పట్టుకొని చనిపోయిందా అని పరిశీలించాడు. దీంతో ఒక్కసారిగా తేరుకున్న పాము రంగస్వామిని కాటేసింది. దీంతో స్థానికులు అతడ్ని హుటాహుటిన ఆదోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రంగస్వామి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో నైపుణ్యంతో పాములు పట్టి చాలా మంది ప్రాణాలు కాపాడిన రంగస్వామి అదే పాముకాటుకు బలవడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Next Story

Most Viewed