రూ. 5 ప్యాకెట్ 30 రూపాయలంట!

by Aamani |
రూ. 5 ప్యాకెట్ 30 రూపాయలంట!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం గుట్కా రవాణాకు అడ్డాగా మారింది. మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి ఆదిలాబాద్‌కు చేరవేసి, ఇక్కడ్నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా‌లకు గుట్కా అక్రమంగా రవాణా అవుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట అక్రమ నిల్వలు పోలీసులకు పట్టుబడుతున్నాయి.

మహారాష్ట్ర నుంచి జోరుగా రవాణా..

మహారాష్ట్రలోని నాందేడ్, నాగ్‌పూర్, అకోలా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో‌కి భారీ ఎత్తున రవాణా సాగుతున్నది. మహారాష్ట్ర‌ను ఆనుకొని ఉన్న బోరజ్, స్వర్ణ, ధర్మాబాద్, బెల్ తరోడా చెక్ పోస్ట్‌ల మీదుగా జిల్లా సరిహద్దు‌లోకి చేరుతున్నది. అక్కడ్నుంచి ఆదిలాబాద్‌కు చెందిన వ్యాపారులు గుట్కాను అక్రమ మార్గాల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈ అక్రమ వ్యాపారానికి సహచర వ్యాపారి ఒకరు ఉన్నారని సమాచారం. నిర్మల్, ఆదిలాబాద్ కేంద్రాలుగా మిగతా ప్రాంతాలకు గుట్కా రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మందమర్రి, ఆసిఫాబాద్, జైనూరు, ఉట్నూరు, ఇచ్చోడ, బైంసా, ఖానాపూర్ లాంటి కేంద్రాలకు వ్యాపారులు గుట్కా చేరవేస్తున్నారు. అక్రమ గుట్కా వ్యాపారులపై కేసులు పెట్టాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అప్పుడప్పుడు పోలీసు దాడులు జరిగితే గాని ఈ దందా బయటపడటం లేదు. పోలీసు యంత్రాంగం పని ఒత్తిడి‌లో ఉన్న సమయం గుట్కా వ్యాపారులకు వరంగా మారుతున్నది. ప్రముఖుల పర్యటనలు, ఇతర పనుల్లో ఖాకీలు నిమగ్నమై ఉన్నప్పుడు ఈ అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. కొందరు పోలీసులు కూడా అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు.

తాజాగా కర్నాటక నుంచి..

కర్నాటకలోని బీదర్ పట్టణం నుంచి కొన్నాళ్లుగా ప్రభుత్వం నిషేధించిన గుట్కా సరఫరా చేస్తున్నది. ఆ ముఠా తాజాగా పోలీసులకు చిక్కింది. హైదరాబాద్, బీదర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి అక్రమ గుట్కా రాకెట్ సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బీదర్ పట్టణం నుంచి లారీలో బియ్యం సంచుల మాటున 160 గుట్కా బ్యాగులను తరలిస్తున్నారు. బీదర్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు నిర్మల్ జిల్లా స్వర్ణ చెక్ పోస్ట్ మీదుగా మహారాష్ట్రలోని యవత్మాల్‌కు గుట్కా రవాణా చేస్తుండగా లారీని పోలీసులు పట్టుకున్నారు. సారంగాపూర్, నిర్మల్, నేరడిగొండ, ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ గుట్కా సరఫరా చేస్తూ మహారాష్ట్రలోని యవతమాల్ పట్టణానికి తీసుకు‌వెళ్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీని వెనుక ఆదిలాబాద్, నిర్మల్ వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.5 ప్యాకెట్ 20 రూపాయలు..

గుట్కా మత్తుకు బానిస అవుతున్న యువత ఎంత ధర పెట్టినా కొనేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం నిషేధించిన పలు గుట్కా ప్యాకెట్లు వ్యాపారుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఐదు రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్‌ను వ్యాపారులు 20 నుంచి 30 రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పాన్ డబ్బాలు, కిరాణా షాపుల్లో రహస్యంగా దాచి పెట్టి కొనుగోలుదారుల సిగ్నల్స్‌ను బట్టి గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఇది వ్యాపారులకు సైతం లాభసాటిగా మారడంతో అక్రమ గుట్కా దందా‌కు ప్రోత్సాహం పెరుగుతున్నది. ఇది యువత పాలిట శాపంగా మారుతున్నది.

భారీగా గుట్కా నిలువల పట్టివేత..

నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కొన్ని ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ గుట్కా వ్యాపారం వెనుక వీరి హస్తం కూడా ఉందని విమర్శలు ఉన్నాయి. మూడ్రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ‌పై దాడులు జరపగా రెండు చోట్ల గుట్కా వెలుగు చూడటం గమనార్హం. మరోవైపు గతవారం నిర్మల్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో సుమారు రూ.15 లక్షల గుట్కా పట్టుబడింది. అంతకు ముందు నిర్మల్, సోన్ పోలీసు సర్కిల్‌లో రూ.20 లక్షల విలువైన గుట్కా పట్టుకున్నారు. గడిచిన మూడు నెలల్లో ఉమ్మడి జిల్లాలో సుమారు కోటి రూపాయల విలువైన గుట్కా పట్టుకోవడం చూస్తే గుట్కా అమ్మకాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతున్నది. ఇప్పటికైనా పోలీసులు తగు చర్యలు తీసుకొని గుట్కా రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story