సింగరేణి ‘సోలార్‌’పై ట్రాన్స్‌కోతో ఒప్పందం

by Sridhar Babu |   ( Updated:2021-01-08 11:48:56.0  )
సింగరేణి ‘సోలార్‌’పై ట్రాన్స్‌కోతో ఒప్పందం
X

దిశ ప్రతిధి, ఖమ్మం : సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ మణుగూరు ఏరియాలో నెలకొల్పిన సోలార్‌ ప్లాంటు నుంచి 30 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను ఓపెన్‌ యాక్సిస్‌ కోసం తెలంగాణ ట్రాన్స్‌‌కో(హైదరాబాద్‌), నార్తరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌, సింగరేణి సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో మూడు పక్షాల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో సింగరేణి మణుగూరు ప్లాంట్ నుంచి టీఎస్‌ ట్రాన్స్‌‌కో లైన్ల ద్వారా అనుసంధానం చేసిన 30 మెగావాట్ల విద్యుత్‌ను మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో వాడుకోవడానికి, అలాగే దీనిలో కంపెనీ వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను ట్రాన్స్‌‌కో వారు కొనుగోలు చేయడానికి అంగీకారం కుదిరింది.

మణుగూరు ప్లాంట్‌కు సంబంధించి పాతికేళ్ల ఉత్పత్తి ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రాథమికంగా రెండేళ్ల పాటు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్ల తర్వాత ఈ ఒప్పందాన్ని తిరిగి రెన్యూవల్‌ చేస్తుంటారు. మణుగూరు సోలార్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న సోలార్‌ విద్యుత్‌లో 90 శాతాన్ని మణుగూరు ఏరియా స్థానిక అవసరాలకే వినియోగిస్తుంది. వాడుతున్న విద్యుత్‌లో 65 శాతం కంపెనీ క్వార్టర్లకు, కార్యాలయాల అవసరాలకు వాడుతుండగా మరో 25 శాతం యంత్ర అవసరాల కోసం గనుల్లో వినియోగిస్తున్నారు. మిగిలిన 10 శాతాన్ని ఇల్లెందులో గృహ, యంత్ర అవసరాలకు వినియోగిస్తున్నారు.

రూ. కోటికి పైగా ఆదా
మణుగూరు ఏరియాలో సింగరేణి సంస్థ తన యంత్ర అవసరాలకు నెలకు 40 లక్షల యూనిట్లు, గృహ అవసరాలకు 10 లక్షల యూనిట్లు ట్రాన్స్‌‌కో వారి విద్యుత్ వాడుతోంది. అయితే 30 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ ప్రారంభమయ్యాక యంత్ర అవసరాలకు వాడే 40 లక్షల యూనిట్లలో 33 లక్షల యూనిట్లను సోలార్‌ ప్లాంట్ ద్వారానే సేకరిస్తోంది. అలాగే గృహ అవసరాలకు వాడే 10 లక్షల యూనిట్లలో 9 లక్షల యూనిట్లను కూడా సోలార్‌ ప్లాంట్ నుంచే వాడుకొంటోంది. ఈ విధంగా తన సోలార్‌ విద్యుత్‌ను తానే వాడుకోవడంతో నెలకు రూ. కోటి 20 లక్షల దాకా విద్యుత్ ఖర్చులను ఆదా చేయగలుగుతోంది.

సీఎండీ శ్రీధర్‌ ఆదేశం మేరకు డైరెక్టర్‌ ఈఅండ్ ఎండీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని ఏరియాలలో కలిపి 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ల నిర్మాణం వేగంగా సాగుతోందని, ప్లాంట్లన్నీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తే సింగరేణి కంపెనీకి ఏడాదికి సుమారు రూ.100 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయల వరకూ ఆదా చేకూరనున్నదని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ (వర్క్‌ షాప్స్‌ అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌‌) ఎన్‌.నాగేశ్వర్‌ రావు, ఎస్‌ఈ సీహెచ్‌ ప్రభాకర్‌, టీఎస్‌ ట్రాన్స్‌ కో (కమర్షియల్‌ అండ్ ఆర్‌ఏసీ) సీఈ శ్రీ వివేకానంద్‌, ఎస్‌ఈ శ్రీ కరుణాకర్‌, టీఎస్‌ నార్తరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ నుంచి సీజీఎం శ్రీ మధుసూదన రావు, ఏఈ శ్రీపాల్‌ (వరంగల్‌) పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed