మరో వివాదంలో సిద్దిపేట కలెక్టర్

by Anukaran |   ( Updated:2021-07-21 03:32:59.0  )
Siddipet-Collector
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట కలెక్టర్ తాజాగా మరో వివాదంలో ఇరుకున్నారు. మల్లన్నసాగర్ ఆర్ఎంఆర్ ప్యాకేజీలో ఎన్సాన్‌పల్లి హెడ్ మాస్టర్ తప్పుడు సమాచారంతో పరిహారం పొందాడనే ఆరోపణలతో సిద్దిపేట కలెక్టర్ ఆ హెడ్ మాస్టర్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై హెడ్ మాస్టర్ స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పుడు సమాచారంతో నష్ట పరిహారం తీసుకోలేదని, తనను విచారించకుండానే సస్పెండ్ చేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ వర్సెస్ హెడ్ మాస్టర్..

మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన తొగుట మండలం వేములఘాట్ గ్రామానికి చెందిన బెలిదే శ్రీనివాసరావు.. ప్రస్తుతం సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయ నిర్వాసితులకు ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో అధికారులను తప్పుదోవ పట్టించి, తన కొడుకుకు బదులు వేరే వారిని కొడుకుగా చూపించి నష్ట పరిహారం పొందారన్న ఆరోపణలో ఆర్డీవోచే విచారణ చేయించిన కలెక్టర్ సోమవారం ఎన్సాన్‌పల్లి హెడ్‌ మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విషయంపై ఎన్సాన్‌పల్లి హెడ్‌ మాస్టర్‌ను సంప్రదించగా.. ‘వేములఘాట్ గ్రామంలో మాది 40 ఎకరాల భూమి ముంపునకు గురైంది. ఇది మాకు పెద్ద నష్టం. అది మా అబ్బాయికి రావాలని కూడా ఎప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. మా అమ్మాయి పేరు మీద పెట్టాను. ఇప్పుడు చెక్ బౌన్స్ అయ్యింది. నాలుగిండ్లు పోయాయి. అందుకే మా తమ్ముడు సంతకం పెట్టకుండా కోర్టుకు వెళ్లాడు. ఇప్పుడు కలెక్టర్ తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధాకరం. 32 ఏళ్ల నా సర్వీస్‌లో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఇది చూసి మా కుటుంబ సభ్యులు చాలా టెన్షన్ పడుతున్నారు. విచారణ నిమిత్తం ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, డీఈవో, ఎంఈవో ఎవరూ నా దగ్గరకు రాలేదు. టీచర్‌‌గా చెబుతున్నాను… మళ్లీ ఒకసారి విచారణ చేసి నిజానిజాలు తెలుసుకోవాలి’. అని హెడ్‌ మాస్టర్ బిలిదే శ్రీనివాస రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై పలువురు స్థానిక నాయకులు స్పందించారు. వేములఘాట్ గ్రామంలో హెడ్‌ మాస్టర్ తమ్ముడు కోర్టులో కేసు వేయడంతోనే.. వారి కుటుంబాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

టీఆర్ఎస్‌కు భారీ షాక్.. హుజురాబాద్ బరిలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు

Advertisement

Next Story

Most Viewed