పండుగ వేళ మహిళలకు చేదు అనుభవం.. కీలక హామీతో శాంతించారు..

by Shyam |   ( Updated:2021-10-02 04:57:10.0  )
పండుగ వేళ మహిళలకు చేదు అనుభవం.. కీలక హామీతో శాంతించారు..
X

దిశ, జగదేవపూర్ : తెలంగాణలో మహిళలకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండగకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరల విషయంలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. జగదేవపూర్ మండలంలో బతుకమ్మ చీరలు తక్కువగా రావడంతో పలు గ్రామాల్లో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా ఉన్న మహిళల కంటే తక్కువ సంఖ్యలో చీరలను ప్రభుత్వం సరఫరా చేసింది. కాగా, మండలానికి సరిపోయే చీరలు మహిళలకు అందకపోవడంతో పలు గ్రామాల్లో మహిళలు నిరసనకు దిగారు.

శనివారం ఉదయం అన్ని గ్రామ పంచాయతీల వద్ద రేషన్ డీలర్లు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో పలువురు మహిళల పేర్లు లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. మండలానికి మొత్తం 15,294 చీరలు రావాల్సి ఉండగా 11,471 చీరలు రావడంతో మిగిలిన 3,823 మంది మహిళలకు చీరలు అందలేదు. దీంతో పంపిణీ కేంద్రాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల వద్ద ఉన్న లిస్టు ప్రకారం చీరలను పంపిణీ చేయగా అక్కడికి వచ్చిన మహిళలకు మీ పేరు లేదంటూ డీలర్లు చెప్పడంతో ఆందోళనకు దిగారు.

తమకు గ్రామంలో రేషన్ కార్డు ఉండి రేషన్ బియ్యం తీసుకుంటున్నా చీరలెందుకు రావని పంచాయతీ కార్యదర్శులను, రేషన్ షాపుల డీలర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం నుండి తక్కువగా వచ్చాయని వారు సమాధానం చెప్పినప్పటికీ వారు సంతృప్తి చెందలేదు. రేషన్ కార్డుల ప్రకారం పంపిణీ చేయాలని లేని పక్షంలో చీరల పంపిణీ నిలిపి వేయాలని కోరారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలను మహిళలు సంప్రదించడంతో అందరికీ చీరలు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

Advertisement

Next Story

Most Viewed