వ్యభిచార గృహం నుంచి ‘మీనా’ను రక్షించిన కరోనా

by Shyam |   ( Updated:2023-12-14 14:45:15.0  )
వ్యభిచార గృహం నుంచి ‘మీనా’ను రక్షించిన కరోనా
X

దిశ, సినిమా : ఆర్జీవీ తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్పార్క్ ద్వారా యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో భాగంగా యంగ్ డైరెక్టర్స్‌కు తమను ప్రూవ్ చేసుకునేందుకు రెండు నిమిషాల వ్యవధిలో కరోనా థీమ్‌తో షార్ట్ ఫిల్మ్ చేసి పంపించాలని సూచించారు. దాదాపు 9వేలకు పైగా షార్ట్ ఫిల్మ్స్ తనకు పంపించగా.. వీటిలో 18 ఫైనల్ చేసినట్లు తెలిపారు. ఈ సినిమాలు తన ఓటీటీ ప్లాట్‌ఫామ్, యూట్యూబ్‌లో ప్రసారం కాగా.. వీటిలో ‘మీనా’ షార్ట్ ఫిల్మ్‌కు స్పెషల్ అప్రిసియేషన్ అందుతోంది. కరోనా అనే మహమ్మారి అందరికీ శత్రువు అయినా.. తన విషయంలో మాత్రం దైవంగా ఎలా మారింది? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘మీనా’ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

‘నా జీవితం పక్కవాడికి సుఖం పంచే ఓ నరకం. నా అరుపులు వారికి ఆనందాన్నిస్తాయి. నా ఏడుపు వారిని మృగాన్ని చేసింది. నా ఆడతనం వారికి కాసులు కురిపించింది. నాకు మాత్రం కన్నీరు మిగిల్చింది. ఇలా బ్రతకడం కంటే చావడం మేలనుకున్న. అప్పుడు నువ్వొచ్చావ్. ప్రపంచం మొత్తం నిన్ను ద్వేషిస్తుంది నేను తప్ప. నువ్వు మనుషుల్ని చాలా మందిని మంచానికి పరిమితమయ్యేలా చేశావు, కడతేర్చావు. అందుకే అందరికీ నువ్వంటే భయం నాకు తప్ప. ఎందుకంటే నీ వల్ల నన్ను వాడుకుని డబ్బులు మొహాన విసిరేసేవాడు నేనున్న వీధికి రావడానికి కూడా భయపడ్డాడు. నన్ను బలవంతంగా ఇందులోకి లాగినవారు నీ వల్ల నన్ను భరించలేమని బయటకు తోసేశారు. ఈ నరకం నుంచి నన్ను ఏ దైవం కాపాడుతుందా అనుకున్నా.. కానీ ఓ రోగం నన్ను కాపాడుతుందని నేను అసలు ఊహించలేదు. కరోనా.. నువ్వు నాకు ప్రాణం పోసిన శత్రువు. నన్ను కాపాడినట్టు నీకు కూడా తెలియదు. ఇప్పుడు నేను నీ నుంచి, నా నిన్నటి బాధలోంచి కోలుకున్నా. ఇప్పటి నుంచి నా కొత్త రణం, కొత్త జీవితం, కొత్త ప్రయాణం మొదలు’ అనే కథ ఒక ఆడపిల్ల వ్యభిచార గృహంలో నరకయాతన అనుభవించిన స్థితిని, అక్కడి నుంచి సేఫ్‌గా బయటపడ్డ పరిస్థితి వరకు వివరించింది. కేవలం రెండు నిమిషాల్లోనే ఇంత గొప్ప కథను చెప్పడం తమను ఫిదా చేసింది అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story