రాష్ట్రంలో ‘రాజకీయ’ సందడి.. మధుసూదనాచారి, కోటిరెడ్డిలకు ఛాన్స్?

by Shyam |   ( Updated:2021-04-05 09:22:14.0  )
రాష్ట్రంలో ‘రాజకీయ’ సందడి.. మధుసూదనాచారి, కోటిరెడ్డిలకు ఛాన్స్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయ సందడి మొదలైంది. ప్రస్తుతం వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. శాసనమండలిలో ఈ ఏడాది ఏడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీకాలం జూన్​ 3న, గవర్నర్​కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్కరి పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్‌ 16న ముగియనుంది.

ఇప్పుడు పదవీకాలం పూర్తయ్యేవారంతా అధికార పార్టీకి చెందిన సభ్యులే. శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్‌ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్‌ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ముగుస్తోంది.

ఈ ఏడాది మొత్తం 9 మంది మండలి సభ్యుల పదవీకాలం ముగియాల్సి ఉండగా.. ఇప్పటికే రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్​, వరంగల్​ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. రెండింటిలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. అదే విధంగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది వచ్చే ఏడాది జనవరి 4న పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటారు. వీరిలో కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్‌రెడ్డి, భానుప్రసాద్‌, పురాణం సతీష్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, భూపాల్‌రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. వీరంతా కూడా గులాబీ నేతలే.

సీఎం వద్దకు క్యూ

పదవీకాలం ముగుస్తున్న శాసనసభ్యుల కోటాలోని ఆరుగురు, గవర్నర్​ కోటాలోని ఒక్కరి స్థానంలో మళ్లీ ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఇప్పటికే పార్టీలో చర్చగా మారింది. ఈ స్థానాల కోసం సీఎం దగ్గరకు క్యూ కడుతున్నారు. కానీ సీఎం నుంచి హామీ మాత్రం రావడం లేదు. దీంతో గులాబీ పార్టీలో రాజకీయ సందడి నెలకొంటోంది. ఓవైపు పార్టీ పరమైన అంశాలు, మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం వడబోతతో పార్టీ అధినేత బిజీగా ఉంటున్నారు.

నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యే కోటాలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ ఆకుల లలితకు స్థానం కల్పించారు. తిరిగి కేటాయించాలని కోరినట్లు ఆమె అనుచరులు తెలిపారు. అయితే ఈ స్థానం కోసం తుల ఉమ, గుండు సుధారాణి పోటీ పడుతున్నారు. వీరిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ సీఎంకు దగ్గర ఉన్న ఉమకు పదవి దక్కే అవకాశం ఉంది.

సంగారెడ్డి జిల్లా నుంచి మహ్మద్ ఫరీదుద్దీన్‌కు మైనార్టీ నుంచి అవకాశం కల్పించారు. సామాజిక వర్గ ప్రాతిపదికన తిరిగి ఫరీదుద్దీన్‌నే ఎమ్మెల్సీ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నర్ కోట నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన డాక్టర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికే మరోసారి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఆయన ఎమ్మెల్సీ బాధ్యతలతో పాటు తెలంగాణ భవన్ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నల్లగొండ జిల్లా నుంచి ఒకరు ఔట్?

జిల్లా నుంచి శాసనమండలి కోటాలో నేతి విద్యాసాగర్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గుత్తా మండలి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, నేతి డిప్యూటి చైర్మన్‌గా ఉన్నారు. నేతికి రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్ ఈ సారి ఉద్వాసన పలుకనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఎంసీ కోటిరెడ్డికి మంచి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే నేతి స్థానంలో కోటిరెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. గుత్తా్కు మరోసారి అవకాశం కల్పించన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కలినట్లు తెలిసింది.

వరంగల్ లో పోటాపోటీగా..

వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనగాంకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు పదవి కాలం జూన్ 3న ముగుస్తుండటంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కలిశారు. తెలంగాణా రాష్త్ర తొలి శాసనసభ స్పీకర్‌గా పని చేసి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. చారికి టికెట్ కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి చందులాల్ నాయక్ తన కుమారుడు ప్రహ్లాదకు టికెట్ కేటాయించాలని పావులు కదుపుతున్నారు. టికెట్ ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్కను ఓడించవచ్చని అధిష్టానానికి వివరించినట్లు అనుచరులు తెలిపారు. మరో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మరోమారు టికెట్ ఆశిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీహరి కుమార్తెను స్టేషన్ ఘన్‌పూర్ లేక వర్ధనపేట నుంచి పోటీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం గుడిమల్ల రవికుమార్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి తనకే కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం.

ఒక్క ఛాన్స్​ ప్లీజ్..​

ఏడు మండలి స్థానాలు ఖాళీ అవుతుండటంతో అధికార పార్టీ బాస్​ ప్రసన్నం కోసం నేతలు పోటీ పడుతున్నారు. గులాబీ బాస్‌ను కలిసి విన్నవించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత వారిలో దాదాపు నలుగురికి ఈసారి అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త వారిని ఎంపిక చేస్తారనే ఆశతో ఉద్యమ నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే సీఎంను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పుకునేందుకు ఇప్పటికే ప్లాన్‌లో ఉన్నారు. ఒక్క ఛాన్స్​ ఇవ్వాలని చెప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. అధినేత కూడా అభ్యర్థుల ఎంపిక కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed