ఏడు పాజిటివ్‌లు, 32 డిశ్చార్జిలు..

by vinod kumar |
ఏడు పాజిటివ్‌లు, 32 డిశ్చార్జిలు..
X

దిశ, న్యూస్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఏడు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నట్లు సమాచారం. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నవారు కోలుకోవడంతో వైద్యులు 32 మందిని డిశ్చార్జి చేశారు. వీరిలో 45 రోజుల శిశువు కూడా ఉన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈ చంటిబిడ్డకు తండ్రి ద్వారా పాజిటివ్ సోకినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యేనాటికి శిశువు వయసు 20 రోజులు మాత్రమేనని, పాతిక రోజుల పాటు చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రోజుల వయసున్న బిడ్డకు పాజిటివ్ వచ్చి, చికిత్స తర్వాత కోలుకోవడం బహుశా దేశంలో ఇదే తొలి కేసు కావచ్చని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 409కి చేరడంతో.. యాక్టివ్‌ పాజిటివ్ పేషెంట్లు 582 ఉన్నారు. దీంతో రాష్ట్రంలో సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాలు కరోనా రహితంగా మారాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా నగరంలో (జీహెచ్ఎంసీ పరిధిలో) మొత్తం 215 కంటైన్‌మెంట్ జోన్లు ఉండగా, గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు లేకపోవడంతో 40 జోన్లను ఎత్తివేసినట్లు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇందులో కార్వాన్, మలక్‌పేట, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌‌నుమా, మెహిదీపట్నం, గోషామహల్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 215 జోన్లలో ఒక్క హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే 114 ఉన్నాయి. గురువారం నాటికి మరో 24 జోన్లను కూడా ఎత్తివేసే అవకాశం ఉందని ఒవైసీ తెలిపారు. రెండు మూడు రోజుల వ్యవధిలో మరో 50 జోన్లు కూడా విముక్తి అవుతాయని, అప్పటికి అక్కడి క్వారంటైన్ గడువు కూడా పూర్తవుతుందని తెలిపారు.

Tags : Telangana, Corona, Positive, Discharge, Infant, Corona-Free districts

Advertisement

Next Story

Most Viewed