అటుఇటు ఊగుతూ…మార్కెట్ల ఊగిసలాట!

by Harish |   ( Updated:2020-03-10 23:51:39.0  )
అటుఇటు ఊగుతూ…మార్కెట్ల ఊగిసలాట!
X

దిశ, వెబ్‌డెస్క్: గత వారాంతం నుంచి భారీ నష్టాలను చూసిన మార్కెట్లు బుధవారం ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్ ప్రారంభమే నష్టాలతో మొదలైనప్పటికీ తర్వాత స్వల్పంగా లాభపడి, మళ్లీ నష్టాల్లోనే కొనసాగుతోంది. ఉదయం 10.30 సమయానికి సెన్సెక్స్ 73.24 పాయింట్ల నష్టంతో 35,561 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 36.30 పాయింట్లు నష్టపోయి 10,415 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూఎస్ మార్కెట్లు స్వల్ప లాభాలను చూశాయి. ఇక మార్కెట్ల పతనానికి ముఖ్య కారణమైన చమురు ధరలు రెండో రోజు కూడా పుంజుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే, సోమవారం నాటి భారీ నష్టాల నుంచి షేర్లు నెమ్మదిగా బలపడుతున్నట్టు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాం ఇంకా కొనసాగుతుండటంతో ఇప్పుడు నమోదవుతున్న లాభాలు ఎంతవరకూ కొనసాగుతాయో తెలీదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటొ, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతుండగా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, సన్‌ఫార్మా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 74.38 వద్ద ఉంది. మంగళవారం యెస్ బ్యాంక్ ఖాతాదారులకు కాస్త ఊరట లభించింది. ఐఎమ్‌పీఎస్, నెఫ్ట్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నామని వెల్లడించింది. ఈ నిర్ణయంతో యెస్ బ్యాంక్ ద్వారా క్రెడిట్ కార్డులు, ఋణాలు తీసుకున్న ఖాతాదారులు ఇతర బ్యాంకుల నుంచి చెల్లింపులు జరుపుకోవచ్చు. ఇప్పుడున్న ఏటీఎమ్‌లన్నీ యథావిధిగా పనిచేస్తున్నాయని, మిగిలిన అన్ని ఏటీమ్‌ల నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని యెస్ బ్యాంక్ వెల్లడించింది.

tags:sensex, nifty, BSE, NSE, stock market

Advertisement

Next Story