ఒడిదుడుకుల స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు

by Harish |   ( Updated:2021-06-08 06:12:54.0  )
ఒడిదుడుకుల స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ప్రారంభంలో లాభాలతోనే మొదలైనప్పటికీ ఆ వెంటనే నష్టాల్లోకి జారాయి. అనంతరం ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ప్రధాని మోదీ దేశంలోని ప్రజలకు ఉచితంగా టీకాను అందించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో పెట్టుబడిదారులు ప్రభుత్వం ఖజానాపై ఆందోళనతో జాగ్రత్త పడ్డారని విశ్లేషకులు తెలిపారు. దీనికితోడు బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ వల్ల సూచీలు దెబ్బతిన్నాయని నిపునులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల కారణంగానే స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదుడుకుల మధ్య ర్యాలీ జరిగి నష్టాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 52.94 పాయింట్లు కోల్పోయి 52,275 వద్ద ముగియగా, నిఫ్టీ 11.55 పాయింట్ల నష్టంతో 15,740 వద్ద ముగిసింది.

నిఫ్టీలో బ్యాంకింగ్ ఇండెక్స్ 1 శాతం పతనమవగా, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంకు రంగాలు డీలాపడగా, ఐటీ, ఆటో, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో కొనుగోళ్ల ఆసక్తి కారణంగా నష్టాలు స్వల్పానికి పరిమితమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టైటాన్, డా రెడ్డీస్, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.89 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed