మరోసారి జీవితకాల గరిష్ఠాలను తాకిన సూచీలు

by Harish |
business1
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం, పండుగ సీజన్ డిమాండ్ పుంజుకోవడం సహా దేశీయంగా అన్నీ సానుకూల పరిణామాలతో సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ర్యాలీ చేస్తోంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ దేశీయ సంఘటనలు మద్దతివ్వడంతో ఓ దశలో బీఎస్ఈఏ సెన్సెక్స్ ఇండెక్స్ 61,963 వద్ద జీవితకాల గరిష్ఠాలను తాకాయి. నిఫ్టీ ఇండెక్స్ సైతం 18,500 మార్కును తాకింది. కీలక రంగాల షేర్ల కోసం మదుపర్లు అత్యంత ఆసక్తిగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 459.64 పాయింట్లు ఎగసి 61,765 వద్ద, నిఫ్టీ 138.50 పాయింట్లు లాభపడి 18,477 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఫార్మా మినహా మెటల్, ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు 2-4 శాతం మధ్య పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 4.4 శాతం పెరగ్గా, టెక్‌మహీంద్రా, టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకి, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్ షేర్లు అధిక లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, డా. రెడ్డీస్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఆటో షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.37 వద్ద ఉంది.

Advertisement

Next Story