మార్కెట్లకు తప్పని నష్టాలు!

by Harish |
మార్కెట్లకు తప్పని నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను నమోదు చేశాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిన చివరి రోజున సూచీలు దారుణంగా పడిపోయాయి. అమెరికాలో పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, రూపాయి బలహీనత బుధవారం నాటి నష్టాలకు కారణమని విశ్లేషకులు స్పష్టం చేశారు. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవ్వడం, దానికితోడు ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడ్ అవ్వడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం నాటి భారీ లాభాల తర్వాత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగడం కూడా మార్కెట్ల పతనానికి కారణమని నిపుణులు పేర్కొన్నారు.

వీటికి తొడు భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు 2019 నాటి కంటే తక్కువగానే ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అభిప్రాయడటం మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు తెలిపారు. అదేవిధంగా రేటింగ్ సంస్థ మూడీస్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉందని ప్రకటించడంతో మార్కెట్లకు రుచించలేదని విశ్లేషకులు వెల్లడించారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 627.43 పాయింట్లు పతనమై 49,509 వద్ద ముగియగా, నిఫ్టీ 154.40 పాయింట్లు కోల్పోయి 14,690 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఫైనాన్స్ రంగం ఇండెక్స్ 2 శాతం డీలాపడగా, బ్యాంకింగ్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు నీరసించాయి. రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా రంగాలు మెరుగ్గా ట్రేడయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.13 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed