‘చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్‌లో లేపేస్తా’

by srinivas |
‘చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్‌లో లేపేస్తా’
X

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లికి చెందిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసుకుంటామంటూ చేసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. తమకు జరుగుతున్న అన్యాయం సీఎం జగన్‌కు చేరేలా వీడియో షేర్ చేయాలని కుటుంబం వేడుకుంది. వివరాల్లోకి వెళ్తే దాన విక్రయం ద్వారా తనకు ఉన్న ఒకటిన్నర ఎకరం భూమిని వైసీపీ నేత తిరుపాల్‌రెడ్డి బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారని వీడియోలో ఆరోపించారు. ఈ ఘటనపై ఈనెల 9న స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే మైదుకూరు రూరల్ సీఐని కలిస్తే న్యాయం జరుగుతుందని చెప్పారని వీడియోలో తెలిపారు.

మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి తొలుత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అంతేకాదు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని..తాము చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబం సెల్ఫీ వీడియోలో బోరున విలపించారు. తనను తీవ్రంగా బూటు కాలితో కొట్టి తన భార్యను స్టేషన్ నుంచి బయటికి గెంటించేశారంటూ కన్నీరుమున్నీరుగా అక్బర్ బాషా విలపించారు.

మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, స్థానిక వైసీపీ నాయకుడు తిరుపాల్‌ రెడ్డి నుంచి రక్షణ కల్పించాలని.. 48 గంటల్లో న్యాయం చేయాలని లేని పక్షంలో తన కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడతామని సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడరు. తనను చంపి తన పొలంలో పాతి పెడతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని..తనను స్టేషన్‌లో కూర్చోబెట్టి తన పొలంలో అక్రమార్కులతో పొలం నాటించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సెల్ఫీ వీడియో ఫేస్‌బుక్ లో వైరల్ కావడంతో జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాషా ఇంటికి పోలీసులను పంపించారు. వారిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. అనంతరం అక్బర్ కుటుంబం ఎస్పీని కలిసి తమ గోడు వెల్లబోసుకుంది.

సీఐపై విచారణకు ఆదేశించాం
ఎస్పీ అన్బురాజన్

మైదుకూరు సెల్ఫీ వీడియోపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. ఫేస్‌బుక్ ద్వారా వీడియో వైరల్ అయిన విషయం తన దృష్టికి వచ్చిందని దీంతో వెంటనే పోలీస్ శాఖ స్పందించిందని తెలిపారు. చాగలమర్రి దువ్వూరు పోలీసుల సహకారంతో బాధితులను కాపాడినట్లు వెల్లడించారు. భూమి ఆక్రమణకు గురైందని అక్బర్ బాషా ఈ నెల 9న స్పందనలో ఒక పిటిషన్ దాఖలు చేశారన్నారు. వెంటనే వారికి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు బాషా కుటుంబం పట్ల మైదుకూరు సీఐ కొండారెడ్డి దురుసుగా ప్రవర్తించారని బాధిత కుటుంబం ఆరోపించిందని దానిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ దేవ ప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించినట్లు ఎస్పీ తెలియజేశారు. మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డిని విచారణ అయ్యేంత వరకు విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ఏడు రోజుల్లో నివేదిక రాగానే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు.

సీఎంవో స్పందన

అక్బర్‌ బాషా కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియోలపై సీఎంవో స్పందించింది. అక్బర్‌ బాషా ఆవేదనపై స్పందించిన సీఎంవో…ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని ఎస్పీ అన్బురాజన్‌ను ఆదేశించింది. ఈ సందర్భంగా అక్బర్‌ బాషా కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చినట్లు ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఘటనపై విచారణ జరపాలని..బాధితులకు న్యాయం చేయాలని…బాధితులకు భద్రత కల్పించాలని సీఎంవో ఆదేశించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

Next Story

Most Viewed