మంత్రి హరీష్ రావుకి గద్వాల్‌లో నిరసన సెగ.. 

by Shyam |   ( Updated:2021-12-22 06:01:19.0  )
మంత్రి హరీష్ రావుకి గద్వాల్‌లో నిరసన సెగ.. 
X

దిశ, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి హరీష్ రావుకి బీజేపీ రూపంలో నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే బుధవారం రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా జరగాల్సిన జిల్లా ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలంలో ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణానికి అధికార పార్టీ చర్యలు తీసుకొని రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వివాదాస్పద స్థలానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ రాములు, జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు చేరుకొని శంకుస్థాపన చేయడానికి సిద్ధం అయ్యారు.

విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకారులతో శంకుస్థాపన జరిగే ప్రదేశం అంతా రణరంగంగా కనిపించింది. అయితే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా పోలీసుల బందోబస్తు మధ్య మంత్రి హరీష్ రావు జిల్లా ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story