హుజురాబాద్‌లో సీక్రెట్ సర్వే… ఈటల ప్రభావం తగ్గిందా? పెరిగిందా?

by Sridhar Babu |   ( Updated:2021-06-28 22:47:24.0  )
హుజురాబాద్‌లో సీక్రెట్ సర్వే… ఈటల ప్రభావం తగ్గిందా? పెరిగిందా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు సీక్రెట్ సర్వే టీమ్స్ రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాయి. అయితే సాధారణ సర్వే బృందాల లాగా వీరు వివరాలు సేకరించడం లేదు. వీరు అడుగుతున్నది ఒక్క ప్రశ్న కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా సర్వే చేస్తున్నారు. ఈటల రాజేందర్ బర్తరఫ్ తరువాత నుండి ఇప్పటి వరకు ఆయన ప్రాభవం తగ్గిందా? పెరిగిందా? అన్న విషయంపైనే వారు ఆరా తీస్తున్నారు. మహిళలు, యువత, వృద్దులు ఇలా అన్ని వర్గాల మనసుల్లో ఏముంది? అన్న విషయం తెలుసుకునే పనిలో పడ్డాయి.

డైలీ అప్ డేట్స్

ప్రతిరోజూ అప్ డేట్స్‌ను ఆయా సర్వే టీమ్స్ ఏజెన్సీలకు పంపించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఏఏ గ్రామాల్లో ఈటలకు వ్యతిరేకత ఉంది..? ఎక్కువ సానుకూలత ఉన్న గ్రామాలు ఏంటి..? ఇందులో సామాజిక వర్గాలు ఏమేమి ఉన్నాయి..? ఇలా తదితర సవివరమైన అంశాలను సేకరిస్తున్నప్పటికీ.. అంతా సీక్రెట్‌గా చేస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్ది రాజేందర్ గ్రాఫ్ తగ్గుతుందా? లేక పెరుగుతుందా? అన్న విషయంపై క్లారిటీగా రిపోర్టులు సేకరిస్తున్నారు.

మరిన్ని నిఘా వర్గాలు

హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన నిఘా వర్గాలు మాత్రమే ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేవి. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బృందాలు కూడా ఇక్కడ మోహరించాయి. వీరు టీఆర్ఎస్ వైఫల్యాలు ఏంటీ..? ప్రజల అవసరాలు ఏంటీ? అన్న వివరాలు సేకరించే పనిలో పడ్డాయి. గులాబీ పార్టీ నాయకులు చేస్తున్న తప్పిదాలు, ప్రచారంలో తీసుకోవాల్సిన ఎత్తుగడలు తదితర అంశాలపై సమగ్రంగా తెలుసుకుంటున్నాయి. హుజురాబాద్‌పై గులాబి జెండా మాత్రమే ఎగురాలన్న సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్.. పలు కోణాల్లో వివరాలు సేకరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే పలు విషయాలపై గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ సేకరించేందుకు నిఘా వర్గాలు తిరుగుతున్నాయి.

Advertisement

Next Story