సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ మరింత విస్తరణ

by Shyam |
సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ మరింత విస్తరణ
X

దిశ, క్రైమ్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోషల్ సెక్యూరిటీ అంశంపై పనిచేసే సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ని మరింత విస్తృతం చేయాలని ఎస్సీఎస్సీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీఎస్సీ చైర్మన్, సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..ఈ కౌన్సిల్ ఇప్పటి వరకూ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, ఉమెన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగాలలో మాత్రమే పనిచేస్తూ వచ్చిందన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో ఐటీ, ఐటీ సంబంధిత పరిశ్రమలతో చాలా దగ్గరగా పనిచేశామన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు, పరిశ్రమలలో అనేక సేవలు అందించినట్టు వివరించారు. ఈ అనుభవంతో ఫార్మా, బిల్డర్స్ అండ్ డెవలపర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ వంటి పరిశ్రమలలో కూడా ఎస్సీఎస్సీ భాగం కావాలని భావించినట్టు తెలిపారు. ఈ క్రమంలో మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలను అమలు చేస్తూనే యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మరింత దృష్టి పెడతామన్నారు. యువత భాగస్వామ్యంతో నేరాల రేటు తగ్గుతోందన్నారు. దీంతో సైబరాబాద్‌లో భద్రతా వ్యవస్థ మెరుగవుతోందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీఎస్సీ బ్రోచర్‌ను సీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story