మళ్లీ వేధింపులు.. ప్రభుత్వ చర్యలేవి?

by Shyam |
మళ్లీ వేధింపులు.. ప్రభుత్వ చర్యలేవి?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి రెండవ విడత ప్రభావం విద్యారంగంపై నేరుగా చూపుతోంది. గత ఏడాది వేసవి పరీక్షలు మొదలు కాకముందే లాక్ డౌన్ కారణంగా మూత పడిన విద్యా సంస్థలు ఇటీవల కొంత కాలం తెరుచుకున్నాయి. అయితే కొంత మంది విద్యార్థులు తరగతులకు హాజరు కాగా.. మరికొంత మంది విద్యార్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరవుతున్నారు . ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ప్రభుత్వంమరోమారు విద్యా సంస్థలను మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ నెలలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతినిస్తామని, పరీక్షల స్టడీ మెటీరియల్ ఇస్తామని పాఠశాలలు తల్లిదండ్రులను వేధిస్తున్నాయి . ఓ వైపు కరోనా వేగంగా విస్తరిస్తుండగా.. మరోవైపు ఫీజుల కోసం పాఠశాలల యాజమాన్యం ఒత్తిడి తెస్తుండడంతో.. తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. తమ పిల్లల విద్యా సంవత్సరం ఎక్కడ నష్టపోతారోనని తీవ్ర మానసిక ఆందోళనలకు గురవుతున్నారు.

పుస్తకాలతో మొదలైన దోపిడి

నగరంలోని చాలా వరకు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వం నిర్ధేశించిన పాఠ్య పుస్తకాలు కాకుండా తాము సొంతంగా రూపొందించిన పుస్తకాలను మాత్రమే కొనుగోలు చేయాలని విద్యాసంవత్సరం ఆరంభంలో
షరతులు పెట్టి తల్లిదండ్రులతో కొనిపించాయి. ఇవి కేవలం పాఠశాలలోనే అందుబాటులో ఉండడంతో ఫీజు బకాయిలకు పుస్తకాలకు లింకు పెట్టి ఫీజు చెల్లించిన అనంతరమే పుస్తకాలు ఇచ్చారు. మరికొన్ని
పాఠశాలలో నోటు పుస్తకాలు కూడా తమ వద్దనే కొనాలని నిర్ధేశించాయి. నాటి నుండి ఆన్ లైన్‌లో తరగతులు నిర్వహిస్తూ వస్తున్న యాజమాన్యాలు సమయం చూసి పరీక్షలకు, పాఠశాల ఫీజులకు లింకులు పెట్టి వసూలు చేస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు అప్పు చేసైనా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇవన్నీ తెలిసి కూడా జిల్లా విద్యా శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు

కరోనా కేసులు పెరుగుతుండడంతో మరోమారు పాఠశాలలను మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. వార్షిక పరీక్షలకు సిలబస్ పూర్తి కాలేదంటూ ఫీజుల వసూలు కోసమే కొన్ని పాఠశాలలు గుట్టు చప్పుడు కాకుండా తరగతులు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, ఫీజులకు, పరీక్షలకు లింకు పెట్టే పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story