ఇప్పుడు స్కూళ్లు తెరిస్తే ఏం చేయాలి?

by  |
ఇప్పుడు స్కూళ్లు తెరిస్తే ఏం చేయాలి?
X

కొవిడ్ 19 కారణంగా విద్యావిధానంలో ఎన్నడూ లేని, అస్సలు ఊహించని మార్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే నాలుగు నెలలుగా ఇంట్లో ఉంటూ, ఆన్‌లైన్ క్లాసుల్లో కష్టపడుతూ, ఇవి హాలీడేస్ అనుకోవాలో లేక అర్థం చేసుకోలేని డేస్ అనుకోవాలో తెలియక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరానికి ఎలాగూ పరీక్షలు రద్దు చేసి, అందర్నీ పాస్ చేసి గట్టెక్కించారు. మరి వచ్చే సంవత్సరం సంగతేంటి? రోజులు గడిచిపోతున్నాయి. ఎవరికీ ఏం చేయాలో అంతుపట్టడం లేదు. ఏది చేద్దామన్నా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. సమాధానం లేని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. కనీసం ఆగస్టులోనైనా పరిస్థితి సద్దుమణిగి కొలిక్కి వస్తుందన్న ఉద్దేశంతో.. ఆ నెలలో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. అయితే ఈ కొత్త పరిస్థితులకు అనుగుణంగా స్కూల్ నిర్మాణాన్ని, అవస్థాపనను మార్చాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దీనికి సంబంధించి నిపుణులు, పీడియాట్రిషియన్లు, సైకాలజిస్టులు కొన్ని సలహాలు సూచనలు అందించారు.

ఆన్‌లైన్ క్లాసులు, హోమ్ ట్యూషన్లు ఇలా ఎన్ని రకాలుగా పిల్లలకు పాఠాలు బోధించాలని ప్రయత్నించినా, పాఠశాల వాతావరణాన్ని మించి ప్రభావితం చేసేది మరోటి ఉండదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ‘జాక్ షంకాఫ్’ అంటున్నారు. విద్యాపరంగానే కాకుండా మానసికంగా, భావోద్వేగాల ఎదుగుదలలో పాఠశాల వాతావరణం పిల్లలకు ఎంతో నేర్పిస్తుందని చెబుతున్నారు. కాబట్టి పాండమిక్ ఉన్నా లేకున్నా ఒక పిల్లాడికి పాఠశాల అవసరం ఎంతైనా ఉందని జాక్ వెల్లడించారు. అయితే ఈ పాండమిక్ పరిస్థితుల్లో పాఠశాల మళ్లీ తెరవాలంటే వాటి పూర్తి రూపాన్ని మార్చకతప్పదని ఆయన సలహా ఇస్తున్నారు.

సామాజిక దూరం..

కరోనా వైరస్ దావానంలా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ముఖ్యంగా పాటించాల్సింది సామాజిక దూరం. అయితే పెద్దలే ఈ సామాజిక దూరాన్ని పాటించడంలో విఫలమవుతుంటే ఇక పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ స్కూళ్లను ఈ సామాజిక దూరానికి తగ్గట్టుగా మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి, పిల్లల్లో దీన్నొక అలవాటుగా మార్చాలి. మాస్క్ లేకుండా 6 అడుగుల దూరం పాటించాలి. మాస్కు ధరిస్తే 3 అడుగుల దూరమైనా సరిపోతుంది కాబట్టి పిల్లల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండేలా తరగతి గదిలో సీటింగ్ ఏర్పాటు చేయాలి. ఇందుకోసం గదులను కాకుండా బయటి స్థలాన్ని ఎక్కువగా వినియోగించుకునేందుకు పాఠశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి.

పరిశుభ్రత

పాఠశాలల్లో చాలా ముఖ్యంగా చేయాల్సిన మార్పు ఇది. విద్యార్థి పరిశుభ్రత కంటే ముందు పాఠశాలలో ప్రతి అంగుళం పూర్తిగా శానిటైజ్ చేయాలి. బెంచీలు, కుర్చీలు, గోడలు, బోర్డులు, చివరికి చాక్‌పీసులు, డస్టర్లు కూడా శానిటైజ్ చేయాలి. అలాగే టీచర్లు, పిల్లలు, పనివాళ్లు తరచుగా చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బు, శానిటైజర్, నీళ్లు అందుబాటులో ఉంచాలి. వీలైతే ప్రతి తరగతి గది ముందు, గేటు దగ్గర, ప్రిన్సిపాల్ ఆఫీస్, గ్రౌండ్ దగ్గర, క్యాంటీన్ వద్ద.. ఇలా ప్రతిచోటా ఈ సదుపాయాలు కల్పించాలి.

టెస్టింగ్, స్క్రీనింగ్

ఏ విద్యార్థి ఒక్క తుమ్ము తుమ్మినా, దగ్గినా లేదా అలసట, నీరసంగా కనిపించినా వెంటనే పరీక్షలు చేయించడానికి వీలుగా ఒక ఆస్పత్రితో ఒప్పందం చేసుకోవాలి. వీలైతే ఒక ఇద్దరు నర్సులను స్కూళ్లోనే ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్య తీసుకోవాలి. కుదిరితే మాస్క్‌లను స్వయంగా పాఠశాల వారే పంపిణీ చేయాలి. ఒకవేళ ఎవరైనా విద్యార్థికి పాజిటివ్ అని తేలితే, అతనితో కాంటాక్టులో ఉన్న ఇతర విద్యార్థులను సులభంగా గుర్తించడానికి వీలుగా వీలైన చోటల్లా సీసీ కెమెరాలు పెట్టించాలి.

ఇన్ని మార్పులు చేసిన తర్వాత కూడా పిల్లలు వీటికి వెంటనే అలవాటు పడతారన్న గ్యారంటీ లేదు. వారి కంటే ముందు తల్లిదండ్రుల్లో ఉన్న మానసిక ఆందోళనను పోగొట్టాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. అందుకోసం పాఠశాలలు తెరవడానికి ముందు చేసిన మార్పులన్నింటినీ వాళ్లకి చూపించి తిరిగి స్కూల్‌కి పిల్లలను పంపవచ్చనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. వారిలో నమ్మకం పెరిగిన తర్వాత పిల్లలను ఈ కొత్త మార్పులకు సులభంగా అలవాటు చేయవచ్చు.


Next Story

Most Viewed