- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరుకే ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు
దిశ, న్యూస్‌బ్యూరో: ఎస్సీ, ఎస్టీ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్) స్కీంలు తెలంగాణలో ‘మేడిపండు చందాన తయారయ్యాయి. అన్ని స్కీముల్లో లబ్ధిదారులుగా ఎస్సీ, ఎస్టీలున్నారని చూపించి చివరకు వారికి అరకొర నిధులే మిగులుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్న ఉద్దేశంతో 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ చట్టం-2017 తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టం ఉన్నప్పటికీ నిధులు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ స్కీంలకు మళ్లుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వెల్లడించిన గణాంకాల్లోనూ ఈ విషయం తేటతెల్లమవుతోంది. రెండు కులాలకు కలిపి రూ.26వేల కోట్లు ప్రత్యేక అభివృద్ధి కింద కేటాయిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వారికి ఇస్తున్నది కేవలం రూ.500కోట్లేనని ప్రభుత్వమే వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ఎస్సీ ప్రత్యేక నిధిలో ఎస్సీలకు వాస్తవంగా రూ.361 కోట్లు
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 15.45 శాతం ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్(ఎస్సీఎస్డీఎఫ్) ప్రధానోద్దేశమని ఎస్సీఎస్డీఎఫ్ చట్టంలో ప్రభుత్వం పేర్కొంది. ఈ నిధి కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.16 వేల534 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఈ నిధుల మొత్తం చూస్తే భారీగానే కేటాయించారనిపిస్తుంది. కానీ, ఇక్కడే ఉంది అసలు కిటుకు.. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన రైతుబంధుకు రూ.2 వేల 163 కోట్లు, రైతుబీమాకు రూ.170 కోట్లు, వ్యవసాయానికి, ఉచిత విద్యుత్‌కు రూ.1545 కోట్లు, మద్దతు ధరకు రూ.154 కోట్లు, కేంద్ర ప్రభుత్వ స్కీం జాతీయ ఆహార భద్రత కింద బియ్యం పంపిణీకి రూ.కోటి ఇలా ఆయా డిపార్ట్‌మెంట్‌ల కింద ప్రగతి పద్దుల్లో పలు స్కీంలకు కేటాయించిన మొత్తం నిధుల్లో నుంచే ఎస్సీ జనాభా ప్రకారం 15.45 శాతం విడదీసి చూపిస్తున్నారు. దీంతో అన్ని స్కీంలలో లబ్ధిదారుల్లానే ఎస్సీలకు నిధులందుతున్నాయి. వీటిలో రాష్ట్ర పథకాల కింద అందే నిధులే కాకుండా కేంద్ర పథకాల్లో నిధులనూ కలిపి చూపిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎస్సీ కార్పొరేషన్ కింద ఎస్సీలకు ప్రత్యేకంగా ఇచ్చే వాహనాల సబ్సిడీ లాంటి స్కీంల నిధులకు మాత్రం రూ.361 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ఏడాది రూ.16 వేల కోట్లు కేటాయించిన ఎస్సీఎస్డీఎఫ్ నిధుల పథకాన్ని లోతుగా పరిశీలిస్తే ఆ స్కీంకు మిగిలింది రూ.361 కోట్లు మాత్రమేనని తెలుస్తోంది.
ఎస్టీల వాస్తవ మిగులు రూ.155 కోట్లు
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 9.08 శాతం. వీరిని అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్(ఎస్టీఎస్డీఎఫ్) ప్రధానోద్దేశమని ఎస్టీఎస్డీఎఫ్ చట్టంలో ప్రభుత్వం తెలిపింది. ఈ నిధి కింద వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 9 వేల 7 వందల 71 కోట్ల వ్యయ అంచనాను ప్రభుత్వం వేసింది. భారీ నిధులు కేటాయిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ, ఇక్కడా ట్విస్టు ఉంది. ఈ నిధుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన రైతుబంధుకు రూ.1,270 కోట్లు, రైతుబీమాకు రూ.1,000 కోట్లు, వ్యవసాయానికి, ఉచిత విద్యుత్‌కు రూ.908 కోట్లు, మద్దతు ధరకు రూ.90 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకమైన జాతీయ ఆహారభద్రత కింద బియ్యం పంపిణీకి రూ.82 లక్షలు ఇలా పలు విభాగాల కింద ప్రగతి పద్దుల్లో పలు స్కీంలకు కేటాయించిన మొత్తం నిధుల్లో నుంచే ఎస్టీ జనాభా ప్రకారం 9.08 శాతం విడదీసి చూపిస్తున్నారు. దీంతో అన్ని స్కీంలలో లబ్ధిదారుల్లాగానే ఎస్టీలకు నిధులందుతున్నాయి. వీటిలో రాష్ట్ర పథకాల కింద అందే నిధులే కాకుండా కేంద్ర పథకాల నిధులనూ కలిపి చూపిస్తున్నారు. అయితే, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇచ్చే స్కీంలకు నిధులు మాత్రం రూ.155 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ఏడాది రూ.9 వేల కోట్లు కేటాయించిన ఎస్టీఎస్టీఎఫ్ పథకాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ ఏడాది ప్రత్యేకంగా ఆ స్కీంకు మిగిలింది రూ.150 కోట్లేనని అర్థమవుతోంది.
tags : sc,st sdf, telangana, flagship scheme funds