రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందంపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు

by Harish |
reliance 1
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ మధ్య జరిగిన ఒప్పందం చెల్లదని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇటీవల ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని కొనసాగించవచ్చని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సవాల్ చేస్తూ అమెజాన్ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ రిటైల్ కంపెనీ చేసుకున్న రూ. 24,713 కోట్ల విలీన ఒప్పందాన్ని నిలిపేయాలని సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిటరేటర్ తీర్పును అమలు చేయాలంటూ అమెజాన్ పిటిషన్‌లో వివరించింది.

ఈ అంశంపై వాదనలు విన్న జస్టిస్ ఆర్ఎఫ్ నారిమ‌న్, జ‌స్టిస్‌ బీఆర్ గ‌వాయిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్టు వెల్లడించింది. ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, హోల్‌సేల్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రిలయన్స్ సంస్థ రూ. 24,713 కోట్లు వెచ్చించి కొనేందుకు ఒప్పందం చేసుకుంది. కానీ, ఫ్యూచర్‌ అన్‌లిస్టెడ్‌ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ సంస్థ 49 శాతం వాటా కొనుగోలుకు 2019, ఆగస్టులో ఫ్యూచర్స్‌ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫ్యూచర్‌ కూపన్స్‌ డీల్‌ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్‌ రిటైల్‌ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్‌ చెబుతోంది. కాబట్టి రిలయన్స్, ఫ్యూచర్ రిటైల్ మధ్య ఒప్పందం చెల్లదని వాదిస్తోంది. ఈ క్రమంలోనే సింగపూర్ ఆర్బిటరేటర్ కోర్టు ఒప్పందంపై స్టే విధించింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా ఒప్పందంపై ముందుకెళ్లొచ్చని తీర్పు ఇచ్చింది. తాజాగా దీన్ని రిజర్వ్ ఉంచాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Advertisement

Next Story

Most Viewed